గద్వాల్‌లో వెలుగు చూసిన హనీ ట్రాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువనాయకులు ఉన్నారని సమాచారం. హనీ ట్రాప్‌కు గురైన మహిళల ఫొటోలు, వీడియోలు బయటకు రావటానికి, సోషల్ మీడియాలో వైరల్ కావటానికి ఆ ముగ్గురు యువనాయకుల మధ్య గొడవ జరగటమే కారణంగా తెలుస్తోంది. గద్వాల్ హనీ ట్రాప్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయని సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకోగా.. వారి దగ్గరినుంచి 150 మంది మహిళల ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయంట.
ఆ ఇద్దరినుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారంట. తాజా సమాచారం ప్రకారం.. కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దర్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. టౌన్ ఎస్‌ఐ నిందితుల నుంచి లక్ష రూపాయలు తీసుకుని వారిని వదిలేశాడన్న ప్రచారం జరుగుతోంది. అరెస్టైన వారిలో ఎస్‌ఐ సన్నిహితుడు ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, నవంబర్ 5న ఈ హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రధాన పార్టీకి చెందిన ముగ్గురు యువనాయకులు అభంశుభం తెలియని మహిళలను లోబర్చుకుని వాట్సాప్లో అశ్లీలంగా మాట్లాడారు.
మహిళలతో మాట్లాడిన వీడియో కాల్ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ముగ్గురు కలిసి దాదాపు 100కు పైగా మహిళల వీడియోలు, ఫొటోలను భద్రపర్చుకున్నారు. తర్వాత సదరు బాధిత మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు నిందితుల్లోని ఒకరికి తమ బంధువైన మహిళ అశ్లీల ఫొటో కనిపించటంతో గొడవ మొదలైంది. ముగ్గురు తీవ్రంగా గొడవపడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తమ ఫోన్లలోని మహిళల ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విషయం బయటపడింది.