ప్రస్తుత కాలంలో చేతిలో కరెన్సీ నోట్లు కనిపించడం చాలా అరుదుగా మారింది. ఏం కొన్నా మొబైల్ ఫోన్‌తోనే పేమెంట్ చేస్తున్నాం. అయితే ఇలా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే సమయంలో ఓటీపీ వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు.. ఓటీపీ స్కాంలకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు..
ప్రస్తుతం నడుస్తోంది డిజిటల్ యుగం. కాలు కదిపే పని లేకుండా.. కూర్చున్న చోట నుంచే మొబైల్‌లోనే అన్ని పనులు చక్క బెడుతున్నాం. వంటింటి సరకులు మొదలు.. లాప్‌టాప్‌ల వరకు ప్రతి దాన్ని ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నాం. కరెంట్ బిల్లు కట్టడం, ఈఎంఐ చెల్లిపులు, షాపింగ్ ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే చేస్తున్నాం. కరోనా తర్వాత డిజిటల్ చెల్లిపులు విపరీతంగా పెరిగాయి. నేడు చేతిలో ఏటీఎం కార్డు కూడా ఉండాల్సిన పని లేదు. మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. అన్ని పనులు అవుతాయి. అయితే డిజిటిలైజేషన్ వల్ల ఎంత లాభం ఉందో.. అందుకు రెట్టింపు నష్టం కూడా ఉంది. ఆన్‌లైన్ పేమెంట్లు పెరుగుతున్న కొద్ది.. ఈ తరహా నేరాలు కూడా పెరుగుతున్నాయి.
ఆన్‌లైన్ మోసాల బారిన పడి లక్షలు పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి మోసాల్లో నిందితులను పట్టుకోవడం, డబ్బు తిరిగి పొందడం చాలా కష్టం. ఇలాంటి సైబర్ నేరాల గురించి పోలీసులు ఎప్పటికప్పుడు జనాలను అప్రమత్తం చేస్తూనే ఉన్నా పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోప్రస్తుత కాలంలో ఓటీపీ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. మరి వాటి గురించి అవగాహన కోసమే ఈ కథనం..
ఆన్‌లైన్ షాపింగ్‌లు పెరుగుతున్న కొద్ది ఈ తరహా మోసాలు అధికమవుతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే.. బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. ఆన్‌లైన్ షాపింగ్, ఆన్‌లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఓటీపీ తప్పనిసరి. ఇది లేకుండా ఏలాంటి ట్రాన్సాక్షన్ జరగదు. ప్రస్తుతం సైబర్ కేటుగాళ్లు.. ఓటీపీ స్కామ్‌లకు పాల్పడుతున్నారు. ఇలా మనకు పరిచయం లేని వ్యక్తులకు, నంబర్లు, మెయిల్స్‌కు స్పందించి ఓటీపీ చెబితే.. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు మాయం అవుతుంది అంటున్నారు సైబర్ నిపుణులు.
మరీ ముఖ్యంగా ఏ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి ఓటీపీ వచ్చిందో తెలుసుకోకుండా.. నిర్థారించుకోకుండా.. ఎవ్వరికి.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఓటీపీ చెప్పకూడదు. డెలివరీ ఏజెంట్లను అడ్డుపెట్టుకుని ఇలాంటి ఓటీపీ స్కామ్‌లకు పాల్పడుతున్నారు. దీనిలో భాగంగా ఏదో ఒక ఈకామర్స్ కంపెనీకి చెందిన డెలివరీ బాయ్‌లా మీ ఇంటికి వస్తారు కేటుగాళ్లు. మీరు ఆన్‌లైన్‌లో ఎలాంటి ఆర్డర్ చేయకపోయినా సరే.. మీ పేరు మీద పార్శిల్ వచ్చిందని నమ్మిస్తారు. ఆర్డర్ డెలివరీ చేయాలంటే.. మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.. చెప్పండి అంటారు. మీరు మేం ఏం ఆర్డర్ పెట్టలేదు అంటే.. సరే క్యాన్సిల్ చేయడానికి కూడా ఓటీపీ వస్తుంది చెప్పండి అంటారు. మాకు సంబంధం లేని ఆర్డర్‌కు మేం ఎందుకు ఓటీపీ చెప్పాలని వాదించినా వినరు.
ఓటీపీ చెప్పేవరకు ఏదో విధంగా మిమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తారు. వారి పోరు తట్టుకోలేక మీరు ఓటీపీ చెప్తే.. ఇక మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. డెలివరీ బాయ్ రూపంలో వచ్చిన కేటుగాడు మీ బ్యాంక్ నుంచి డబ్బులు దోచేస్తాడు. ఇలాంటి కేటుగాళ్లు.. వృద్ధులు, చదువుకోని వారిని టార్గెట్ చేసుకుని.. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. వీరి మొబైల్‌కు డబ్బులు పే చేయాలని ఓ లింక్ పంపుతారు కేటుగాళ్లు. దాని ద్వారా పేమెంట్ చేయాలని ప్రయత్నిస్తే.. మన వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు అన్ని స్కామర్ల చేతికి చిక్కుతాయి. అందుకే ఇలాంటి డెలివరీ బాయ్‌లు, ఏజెంట్‌లకు ఓటీపీలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి పది సార్లు నిర్థారించుకుని.. ఓటీపీ షేర్ చేయాలి అంటున్నారు సైబర్ క్రైం నిపుణులు.
తెలియని, నమ్మకం లేని వెబ్‌సైట్ లింకులు అస్సలు ఒపెన్ చేయకూడదు అంటున్నారు. మనకు సంబంధం లేకుండా ఎలాంటి డెలివరీ రిక్వెస్ట్ వచ్చినా స్పందిచంకూడదు అంటున్నారు. ఇలాంటి డెలివరీ బాయ్‌లు ఇంటి దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని.. అనుమానాస్పదంగా అనిపిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అంటున్నారు. అలానే ఆన్‌లైన్ పేమెంట్లు చేసేటప్పుడు ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఉన్న క్రెడిట్ కార్డులు వినియోగించాలి. సెక్యూర్ పేమెంట్లు చేయాలి అని సూచిస్తున్నారు. అలనే ఎప్పటికప్పుడు కొత్త తరహా స్కామ్‌ల గురించి తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.