రైతు దేశానికి వెన్నుముక్క అంటూ రాజకీయ నేతలు గొంతులు పోయేలా అరుస్తారు. కానీ వారు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక మన దేశంలో చాలా మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటనే ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏటూరి నాగారం మండలం శివాపురం గ్రామంలో బేతిల్లి కుమార్ అనే రైతు నివాసం ఉంటున్నాడు. అయితే గతంలో తన ఆరు ఎకరాల్లో ధాన్యాన్ని పండించాడు. ఇక కోతకు రావడంతో ఎలాగో కష్టపడి ధాన్యాన్నంత మార్కెట్ కు తరలించాడు.
అమ్మడానికి వెళ్లిన అన్నదాతకు అక్కడ నిరాశే మిగిలింది. రోజులు గడిచిన ఆ రైతు పండించిన పంటను మాత్రం ఎవ్వరూ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో భయంతో తన్నుకొస్తుండడంతో ఏం చేయాలో అర్థంకాలేదు. కోతకు ఇంకా రెండెకరాల పంట చేనులో ఎదురుచూస్తూ ఉంది. ఇటు వేధిస్తున్న అప్పల బాధలు, ఇటు మార్కెట్ లో ఎవ్వరి కొనుగోలు చేయని ధాన్యం. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు. అయినా ఆ రైతు నా ధాన్యాన్ని ఎవరైన కొంటారులే.. నా అప్పులన్ని తీరుతాయనే ఏదో నమ్మకంతో కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. రోజులు గడిచినా రైతు ధాన్యం కొనుగోలు మాత్రం జరగలేదు. దీంతో ఆ రైతు తీవ్ర మనోవేధనకు గురయ్యాడు.
ఇక వెంటనే ఇంటి వద్ద ఉన్న తన తమ్ముడికి ఫోన్ చేసి.. తమ్ముడా.. నేను వెళ్లిపోతున్నానంటూ ఫోన్ కట్ చేసి అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి వెళ్లి చూసేసరికి విగతజీవిలా పడి ఉన్నాడు. దీంతో బేతిల్లి కుమార్ కుటంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఇప్పటి వరకు కుమార్ రూ.10 లక్షల మేర అప్పులు చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏటూరి నాగారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇలా ఎంతో మంది అన్నదాతలు అప్పుల బాధలు తట్టుకోలేక పిట్టల్ల రాలిపోతున్నారు. గుండె బరువెక్కే ఈ రైతన్నఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.