సోషల్ మీడియా కేవలం సమాచారాన్ని షేర్ చేసుకునే సాధనంగానే కాదు.. ప్రేమకు కూడా ఓ వాహకంలా మారిపోయింది. చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియా వల్లే ప్రేమ స్టోరీలు ప్రాణం పోసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి వల్ల ప్రేమ కథలు పుంఖానుపుంకాలుగా పుట్టుకొస్తున్నాయి. తాజాగా, ఓ యువకుడు ఆన్లైన్లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమే తన ప్రాణం అనుకున్నాడు. పెళ్లి చేసుకోవటానికి కూడా సిద్ధం అయ్యాడు. అయితే, అమ్మాయి గురించిన అసలు నిజం తెలిసి షాక్ అయ్యాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి? అ అమ్మాయి గురించి ఏ నిజం అతడికి తెలిసింది? అన్నది తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదివేయండి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూ ఢిల్లీలోని గౌతమ్పురికి చెందిన 17 ఏళ్ల ఓ యువకుడికి కొద్దిరోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ అమ్మాయి పరిచయం అయింది.
వీరిద్దరూ తరచుగా చాటింగ్ చేసుకునే వారు. తర్వాతి కాలంలో వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఇద్దరూ ప్రేమ కబుర్లు చెప్పుకునేవారు. ఆ యువకుడు.. అమ్మాయిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే అతడిని కుదిపేసే ఓ విషయం తెలిసింది. తాను ఇంతకాలం చాటింగ్ చేసిన.. ప్రేమించిన అమ్మాయి.. అసలు అమ్మాయి కాదని, అబ్బాయని తెలిసింది. ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ ద్వారా తనను మోసం చేశాడని అర్థం అయింది. దీంతో అతడి గుండె పగిలింది. తనను మోసం చేసిన యువకుడిపై కక్ష పెంచుకున్నాడు.
అతడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన మిత్రుడితో కలిసి ఓ ప్లాన్ వేశాడు. తుపాకి తీసుకుని తనను మోసం చేసిన యువకుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ తుపాకితో ఆ యువకుడి ఇంటిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులు కేవలం అతడ్ని భయపెట్టడానికి జరిపినవి కావటంతో ఎవరికీ గాయాలు కాలేదు. బాధిత వ్యక్తి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దర్నీ అరెస్ట్ చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.