మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పరిధిలో ఇందు అనే 10 ఏళ్ల బాలిక ఇటీవల కనిపించకుండాపోయి చివరికి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమంగా మారింది. అయితే మా కూతురును చంపేసి ఆ తర్వాత చెరువులో పడేశారని, నిందితులు ఎవరో పట్టుకోవాలని ఆ బాలిక తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. ఇక పోస్ట్ మార్టం అనంతరం ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు అసలు నిజాలు బయటపెట్టారు.
తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన దమ్మాయిగూడ బాలిక అనుమనాస్పద మృతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. స్థానిక సీసీ కెమెరాలతో పాటు పోస్ట్ మార్టం రిపోర్టును సైతం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఈ ఘటనపై తల్లిదండ్రులతో పాటు స్థానికులకు సైతం ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ బాలికను ఎవరో హత్య చేసి ఉంటారని, చంపేసి ఆ తర్వాత చెరువులో పడేశారనే అన్నారు. దీంతో ఈ కేసును అన్నికోణాల్లో విచారించిన పోలీసులు బాలికది హత్య కాదని తేల్చారు. ప్రమాదవశాత్తు చెరువులో పడే ఆ బాలిక ఊపిరాడక చనిపోయిందని పోలీసులు తేల్చారు.
అసలేం జరిగిందంటే?
జవహర్ నగర్ పరిధిలో ఎన్టీఆర్ నగర్ కాలనీలో నరేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. ముగ్గురూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. దీంతో తల్లిదండ్రులు గిన్నెల షాపును నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే స్థానిక స్కూల్లో 8వ తరగతి చదువుతున్న నరేష్ కూతురు ఇందు (10) ఈ నెల 15న స్కూల్ కు వెళ్లి సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ తల్లిదండ్రులు స్కూల్ హెడ్ మాస్టర్ ను అడిగి తెలుసుకున్నారు. అయినా కూతురు జాడ తెలియదు. అనంతరం స్థానిక పరిసరాల్లో వెతికారు. ఎంత వెతికినా కూతురు జాడ మాత్రం దొరకలేదు.
ఇక ఏం చేయాలో తెలియక ఇందు తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అనంతరం స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆ బాలిక స్థానికంగా ఉండే చెరువు వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత చెరువులో గాలించగా ఇందు శవమై కనిపించింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. మా కూతురుని ఎవరో హత్య చేసి చెరువులో పడేశారని తల్లిదండ్రులు వాపోయారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఇక అన్ని కోణాల్లో విచారించగా చివరికి.. ఆ బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించిందని పోలీసులు తేల్చారు. దీంతో మొత్తానికి ఈ కేసు మిస్టరీ వీడింది.