ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించి జీవితంలో చోటు చేసుకున్న చిన్న చిన్న సంఘటనలతో నూరేళ్ల జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు, కుటుంబకలహాలతో కొందరు జీవితంపై విరక్తి చెంది తనువు చాలిస్తున్నారు. ఇదే విధంగా ఓ కానిస్టేబుల్ తనకున్న చిన్న సమస్యతో ఆందోళన చెంది షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
కొందరు ఉన్నదాంతో సంతృప్తి పడక లేనిదానికోసం ఆరాటపడి ఇబ్బందులను కొనితెచ్చుకుంటారు. ప్రస్తుత రోజుల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందంగా కనిపించడానికి కూడా నానా పాట్లు పడుతున్నారు. అందంగా లేకపోతే అసలు జీవితమే లేనట్లుగా భావిస్తున్నారు. స్లిమ్ గా స్మార్ట్ గా కనిపించేందుకు పలు రకాల శస్త్రచికిత్సలు చేయించుకుని ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఓ కానిస్టేబుల్ ఓ వ్యాదితో బాధపడుతూ జుట్టు రాలిపోతుందేమోనని ఆందోళన చెంది షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
యువతీ యువకులు అందంగా కనిపించేందుకు డైటింగ్, వ్యాయామాలు చేస్తూ చెమటోడ్చుతుంటారు. ముఖంపై చిన్న మొటిమ కనిపించినా ఆందోళన చెందుతారు. జుట్టు రాలుతున్నా, తల పలచబడినా కొందరు తట్టుకోలేరు. తమకు ఏవో అనారోగ్య సమస్యలున్నాయని అందువల్లనే ఇలా జరుగుతుందని మనోవేధనకు గురవుతుంటారు. ఇదే విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో పాటు జుట్టు కూడా రాలిపోతుందని ఆందోళన చెంది ఆ చర్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లాయగూడ గ్రామానికి చెందిన వినోద్ కుమార్ మూడేళ్ల క్రితం కానిస్టేబుల్ ఉద్యోగం పొందాడు.
అతడు మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడు కొంత కాలం క్రితం చర్మవ్యాధిభారిన పడ్డాడు. వైద్యుల సలహామేరకు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో గత 20 రోజుల నుంచి విధులకు సెలవు పెట్టి ఇంటి వద్దనే ఉంటున్నాడు. చర్మ వ్యాధితో బాధపడుతున్న అతడు తీవ్రమనస్థాపానికి గురై నిన్న (శుక్రవారం) ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉండగా కానిస్టేబుల్ ఆత్మహత్యకు అనారోగ్య కారణాలే కాకుండా జుట్టు రాలిపోవడం కూడా ఓ కారణంగా తెలిసింది. బట్టతల వస్తుందేమోనని ఆయన స్నేహితుల వద్ద ఆందోళన చెందేవాడని సమాచారం. ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.