నాది 5 ఏళ్ల ప్రేమాయణం. అన్నీ తానే అనుకుని అతడిని ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించా. కన్నవాళ్ల కన్నా ప్రియుడే ఎక్కువనుకుని అతని వెంటే తిరిగాను. కానీ అదే ప్రియుడు చివరికి నన్ను ఒంటరిని చేసి కాదు పొమ్మన్నంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా ప్రియుడి చేతిలో మోసపోయిన ఈ ప్రియురాలి ప్రేమకథలో చివరికి ఏం జరిగింది? తర్వాత ప్రియురాలు ఎలాంటి నిర్ణయం తీసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది చెన్నైలోని మనాలి ప్రాంతం. ఇక్కడే ఏంజెల్ అనే యువతి నివాసం ఉంటుంది. జీవితంలో గొప్పగా స్థిర పడాలనుకున్న యువతి ఆ దిశగా అడుగులు వేస్తూ వచ్చింది.
అయితే ఈ క్రమంలోనే ఏంజెల్ కు ధనుష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే ధనుష్ ఎంజెల్ ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఇక ధనుష్ మోసపూరిత మాటలు నమ్మిన ఏంజెల్.., తన మనసు కరిగి అతని ప్రేమలో పడిపోయింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక వీలైనప్పుడుల్లా సినిమాలు, షికారులు అంటూ తిరుగుతూ ఇద్దరు ఎంజాయ్ చేశారు. అలా వీరి ప్రేమాయణం 5 ఏళ్లు నడిచింది. ఇన్నేళ్ల ప్రేమాయణంలో ప్రియుడు ధనుష్ పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు ఏంజెల్ ను నమ్మించాడు. దీంతో ఏంజెల్ కూడా పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకోవాలని ఫిక్స్ అయింది. అయితే ఈ క్రమంలోనే ప్రియుడు ఉన్నట్టుండి ఎంజెల్ కు ఫోన్ చేయడం మానేశాడు.
దీంతో ఏంజెల్ ఎన్నోసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. కొన్నిరోజుల తర్వాత ఏంజెల్ కు తెలిసింది ఏంటంటే? ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని. ఈ విషయం తెలుసుకున్న ఏంజెల్.. ధనుష్ తల్లిదండ్రులను ఆశ్రయించింది. మీ కుమారుడు నన్ను ప్రేమించాడని, ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని వివరించింది. ఇక స్పందించిన ధనుష్ తల్లిదండ్రులు.., అతని ఇష్ట ప్రకారమే జరుగుతుందని, మేమేం చేయాలేమంటూ చేతులెత్తేశారు. వీరి మాటలు విన్న ఏంజెల్ తీవ్ర మనస్థాపానికి లోనైంది.
అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లింది. ప్రేమించినవాడు మోసం చేయడంతో తట్టుకోలేకపోయింది. ప్రేమించిన వాడిని మరిచిపోలేక, అతనిని విడిచి ఉండలేకపోయింది. ఇక చేసేదేం లేక ఆత్మహత్యే మార్గమని ఆలోచించిన ఏంజెల్.. ప్రియుడు ధనుష్ తో చేసిన ఛాటింగ్ బయటపెట్టి చివరికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ప్రియుడు ధనుష్ పై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.