ప్రభుత్వం నిషేధించినా కూడా కొన్ని వస్తువుల అమ్మకాలు దేశంలో యథేశ్చగా సాగుతున్నాయి. అలాంటి వాటిలో గాలిపటం ఎగరేయటానికి వాడే చైనా మాంజా ఒకటి. ఈ చైనా మాంజా అత్యంత ప్రమాదకరమని భావించిన ప్రభుత్వం ఎప్పుడో దీన్ని బ్యాన్ చేసింది. అయినప్పటికి అమ్మకాలు మాత్రం ఆగటం లేదు. జనం కూడా దాన్నుంచి ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ చైనా మాంజా కారణంగా చాలా జంతువులు, పక్షలు.. అంతెందుకు మనుషులే ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు. తాజాగా, ఓ బాలుడు చైనా మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.
తండ్రితో పాటు బైకుపై వెళుతున్న అతడి గొంతను మాంజా తెగ్గోయటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బెళెగావి జిల్లా, హత్తరగి గ్రామానికి చెందిన వర్ధన్ ఈరణ్ణ బ్యాళి అనే ఆరేళ్ల పిల్లాడు పండగకు కొత్త బట్టలు కొనడానికి తండ్రితో కలిసి బయటకు వెళ్లాడు. తండ్రీకొడుకులు కలిసి బైకుపై బట్టల షాపునకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో బైకు గాంధీ నగర బ్రిడ్జి మీదకు వచ్చింది. బైకు వేగంగా బ్రిడ్జి మీద వెళుతుండగా హఠాత్తుగా మాంజా తాడు బాలుడి గొంతును తాకింది.
బలంగా అతడి గొంతును కోసింది. దీంతో పెద్ద గాయమై తీవ్ర రక్తస్రావం అవ్వసాగింది. కిందపడిపోయిన కుమారుడ్ని తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రి వైద్యులు అతడికి అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికి అతడు బతకలేదు. చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. బాలుడి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చైనా మాంజా తమ కుమారుడి ప్రాణాలు బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.