ఈ మధ్య కాలంలో దేశంలో హనీ ట్రాప్‌లు ఎక్కువయిపోయాయి. ఈజీ మనీ కోసం కొంతమంది అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తిని ఓ గ్యాంగ్ మోసం చేసింది. డబ్బు సహాయం చేయటానికి ఇంటికి వెళ్లిన అతడిపై హనీ ట్రాప్ వేసింది. చాటుగా వీడియోలు తీసింది. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించింది. చివరకు పాపం పండి పది మంది గ్యాంగ్ సభ్యులు జైలు పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని బనశంకరి ప్రాంతానికి చెందిన జైరామ్ అనే వ్యక్తి హైకోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి కొన్ని నెలల క్రితం అనురాధ అనే యువతి పరిచయం అయింది.
తన ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది ఉందని, ఓ పది వేల రూపాయలు ఇమ్మని అనురాధ, జైరామ్‌ను అడిగింది. అతడు ఇచ్చాడు. అక్టోబర్ 10న ఆ డబ్బుల్ని తిరిగిచ్చింది. కొన్ని రోజుల తర్వాత మరో 5 వేల రూపాయలు కావాలని అడిగింది. ఆ డబ్బులు ఇవ్వటానికి జైరామ్ అనురాధ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె చేతికి ఐదు వేల రూపాయలు ఇస్తున్నపుడు కొందరు వ్యక్తులు చాటుగా వీడియోలు తీశారు. ఆ వెంటనే వారి దగ్గరికి వచ్చారు. ‘నువ్వు నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు’ అంటూ ఓ వ్యక్తి జైరామ్‌పై బెదిరింపులకు దిగాడు. తన దగ్గర వీడియోలు ఉన్నాయంటూ భయపెట్టాడు.
ఇదే విషయాన్ని జైరామ్ భార్యకు కూడా చెప్పారు. 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే వీడియోలను బయట పెడతామని అన్నారు. ఈ నేపథ్యంలో జైరామ్ పోలీసులను ఆశ్రయించాడు. ముఠాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాంగ్‌కు చెందిన 10 మంది సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలోని కొంతమంది పాత నేరస్తులని పోలీసులు వెల్లడించారు.