తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమీ? వాడు గిట్టనేమీ? అనే వేమన పద్యం అందరూ చదువుకునే ఉంటారు. ఇప్పుడు ఈ కోవకు చెందిన పుత్రులే ఎక్కువైపోతున్నారు. తల్లిదండ్రులేమో పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటూ ఆశలు పెట్టుకుని కొడుకు కోసం అందరు దేవుళ్లను మొక్కుతుంటారు. కానీ, ఇలాంటి పుత్రులు మాత్రం బతికుండగానే తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు.
భర్తపోయి ఒంటరిగా బతుకుతున్న తల్లి బాధ్యత తీసుకోకుండా.. అనాథను చేద్దామనుకున్న పుత్ర రత్నాన్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై మైలాపూరుకు చెందిన దుర్గాంబాళ్(74) నా కుమారుడిని అరెస్టు చేయాలంటూ ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. భర్త పోయి ఒంటరిగా మిగిలిన నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు.. న్యాయం చేయాలని వేడుకుంది.
దుర్గాంబాళ్ ఫిర్యాదులో ఏం చెప్పిందంటే.. “నేను నా భర్త కుప్పుస్వామి కలిసి జీవించేవాళ్లం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు రెండేళ్ల క్రితమే మరణించాడు. రెండో కుమారుడు రామకృష్ణన్ అమెరికాలో స్థిరపడ్డాడు. భార్యాబిడ్డలతో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు. జులై 3న నా భర్త కూడా మరణించాడు. విషయం చెప్పినా కావాలనే అంత్యక్రియలు పూర్తైన పదిరోజులకు చెన్నై వచ్చాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
“ఇండియా వచ్చిన కుమారుడిని చూసి.. ఒంటరిగా ఉన్న నన్ను ఆదుకోవాలని, ఆర్థికంగా సహాయం చేయాలంటూ నా కుమారుడిని కోరాను. అందుకు నా కొడుకు నిరాకరించాడు. నా బాధ్యత తీసుకోవడానికి నిరాకరించిన నా కుమారుడిపై చర్యలు తీసుకోండి” అంటూ దుర్బాంబాళ్ ఫిర్యాదులో పోలీసులను వేడుకుంది. ఆమె ఫిర్యాదుతో రామకృష్ణన్‌పై సీనియర్ సిటిజన్ పర్యవేక్షణ చట్టం 2007 కింద కేసు నమోదు చేశారు.
రామకృష్ణన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతను దేశం దాటకుండా చూడాలంటూ విమానాశ్రయ అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసుల కళ్లుగప్పి రామకృష్ణన్ తెల్లవారుజామున విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే పాస్‌పోర్ట్ తనిఖీ సమయంలో ఇతనిపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు గ్రహించిన అధికారులు పోలీసులకు తెలపగా.. అరెస్టు చేశారు. రామకృష్ణన్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.