సమాజంలో ప్రేమ వివాహాలు సర్వసాధారణం. ఎందరో కులమతాలను పట్టించుకోకుండా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. అందుల్లో సక్సెస్, ఫెయిల్యూర్ రెండు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రేమించటమే నేరంగా వారికి శిక్షలు వేస్తుంటారు. అందులో కొన్ని మాత్రమే బయట ప్రపంచానికి తెలిసేది. అయితే హైదరబాద్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. దళిత యువతిని పెళ్లి చేసుకునందుకు ఓ యువకుడిని ఉద్యోగం కోల్పోయాడు.
అసలు విషయంలోకి వెళ్తే…హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నక్కా యాదగిరి గౌడ్ అనే వ్యక్తి 14 ఏళ్లుగా స్థానిక శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం కౌంటర్లో పనిచేస్తున్నాడు. ఆయన అక్కడే ఆలయంలోనే ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. రెండు నెలల క్రితం యాదగిరి ప్రేమలత అనే దళిత అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ ఛైర్మన్ లక్ష్మయ్య మరియు ఇతర కార్యనిర్వాహకులు యాదగిరిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. తన భర్తను ఉద్యోగం నుంచి తీసేయోద్దని శనివారం ప్రేమలత లక్ష్మయ్య ఇంటికి వెళ్లి కోరింది. దీంతో ఆయన ఆమెను కులం పేరుతో దూషించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.
ఆలయ కమిటీ సభ్యులు తమ అనుచరులతో కలిసి ఆలయంలో యాదగిరి ఉంటున్న గది తాళాలు కూడా పగులకొట్టి అందులోని సామాన్లను బయట పడేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదుకు నిరాకరించారని బాధితులు తెలిపారు. అయితే విషయం అందరికి తెలియడంతో… నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారన్నారు. ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.