తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆర్డీవో, డీఎస్పీ, మహిళా కానిస్టేబుళ్లకు చేదు అనుభవం ఎదురైంది. వివాదంలో ఉన్న రేషన్ డిపోను కోర్టు ఆదేశాల మేరకు అప్పగించాల్సిందిగా కోరిన అధికారులపై ఆ మహిళ దాడికి దిగింది. కళ్లల్లో కారం కొట్టి.. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన అధికారులపై రాడ్డుతో దాడి చేసింది. పోలీసుల కథనం వివరాల ప్రకారం.. రాయవరం మండలం నదురుబాధకు చెందిన జ్యోతి అనే మహిళకు చెందిన రేషన్ డిపో గత కొంత కాలంగా కోర్టు వివాదంలో ఉంది. జ్యోతికి చెందిన డిపోని మహిళా స్వశక్తి సంఘం సభ్యురాలికి అందజేయాలని కోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి: సర్వసాధారణంగా జపాన్ రాకుమారి వివాహం..
కోర్టు ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారులు డిపోను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు ఆమె సరిగా స్పందించలేదు. అందుకని ఏకంగా ఆర్దీవో సింధు సుబ్రహ్మణ్యం, డిఎస్పీ బాల చంద్రారెడ్డి నేరుగా ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు. ఎంతకీ జ్యోతి వినకపోవడంతో ఇల్లు తలుపులు బలవంతంగా తెరవాల్సిందిగా ఆర్డీవో ఆదేశించారు. ఇల్లు తలుపులు తెరిచేందుకు మహిళా కానిస్టేబుళ్లు ప్రయత్నించారు. ఆ క్రమంలో జ్యోతి అధికారుల కళ్లల్లో కారం కొట్టింది. తలుపులు తెరిచేందుకు యత్నించిన వారిపై రాడ్డుతో దాడి చేసింది. జ్యోతి ప్రవర్తనకు నివ్వెరపోయిన అధికారులు ఆమెపై కేసు నమోదు చేయాలంటూ డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
