ఖమ్మం జిల్లాలోని ఓ బాలుడు అదుపు తప్పి మున్నేరు వంతనపై నుంచి జారి నదిలో పడ్డాడు. దీంతో అస్మారక స్థితిలోకి వెళ్లిపోయి రాత్రంత అక్కడే గడిపిన ఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నాయుడుపేట పరిధిలోని ఇందిరమ్మ కాలనీ. కవిత అనే వివాహితకు పెళ్లై ఈశ్వర్ అనే కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో భర్త పెళ్లైన కొన్నాళ్లకే మరణించాడు. ఇక కుమారుడు ఈశ్వర్ నయాబాజర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ కి రోజు ఇంటి నుంచి బస్సులో వెళ్లి వస్తుంటాడు.
అయితే సోమవారం కూడా యాదావిధిగా స్కూల్ కు వెళ్లాడు. బస్సు ఛార్జీల కోసం కొంత డబ్బును తన బ్యాగులో దాచుకున్నాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాగులో ఉన్న డబ్బును దొంగింలించారు. దీంతో ఇంటికి వెళ్లటానికి చేతిలో చిల్లగవ్వలేదు. ఏం చేయాలో తెలియక ఇంటికెళ్లడానికి నడక ప్రారంభించాడు. అలా నడుచుకుంటూ సాయంత్రం వేళ మున్నేరు నది వంతెన వరకు చేరుకున్నాడు. అదే సమయంలో అటు నుంచి ఇటు నుంచి ఒకేసారి రెండు బస్సులు రావడంతో ఎటు వెళ్లాలో తెలియక వంతెన గోడపైకి ఎక్కాడు. ఇక వెనక నుంచి బస్సు అతి వేగంగా హారన్ కొట్టడంతో భయంతో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు.
కింద పడ్డ సమయంలో ఆ బాలుడి తలకు రాయి తగలడంతో స్పృహ కోల్పోయాడు. ఇక అర్థరాత్రి స్పృహ రావడంతో కళ్లు తెరిచి చూస్తే అంతా చీకటి, చుట్టు నీరు. ఏం చేయాలో అర్థం కాక లేచి నడుద్దామని అడుగేసేసరికి కాళ్లు విరిగిపోయాయి. దీంతో ఏడ్చుకుంటూ రాత్రంతా బిక్కు బిక్కు బంటూ నీటిలోనే గడిపాడు. ఇక ఉదయం అటు నుంచి గమనించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న డాక్టర్ లు బాలుడి కాళ్లు పూర్తిగా విరిగిపోయాయని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి కవిత తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నా కుమారుడి చికత్స కోసం నా దగ్గర డబ్బు లేదని, ఎవరైన దాతలు ఆదుకోవాలంటూ వేడుకుంది.