శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెంది.. ప్రపంచాలు ముందుకు దూసుకుపోతున్న ఈ సమయంలో కొన్ని విషయాల్లో వెనకబాటుతనం ఉంటోంది. కొంతమంది ఆడపిల్లల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. అత్యంత దారుణంగా విషప్రయోగాలు చేస్తున్నారు.
ప్రపంచం నలువైపులా ఆడ పిల్లల మీద అకృత్యాలు ఎక్కువయిపోయాయి. తినే తిండి, వేసుకునే బట్టలు, చదువు ఇలా అన్ని విషయాల్లో వారిని కట్టడి చేయటానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్లకు కనీస స్వేచ్ఛను ఇవ్వటం లేదు. కొన్ని దేశాల్లో ఆడపిల్లలపై కఠిన ఆంక్షలు ఉంటున్నాయి. తాజాగా, ఇరాన్ దేశంలో 50 మంది ఆడపిల్లలపై విష ప్రయోగం చేశారు. వారిని చదువుకోకుండా ఆపడానికి ఈ ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను దేశ విద్యా శాఖ సహాయ మంత్రి ఆదివారం మీడియాకు వెళ్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కొందరు కావాలనే ఈ పని చేశారు. కొందరు అన్ని స్కూళ్లు..
ముఖ్యంగా ఆడపిల్లలు చదువుతున్న స్కూళ్లు మూసివేయబడాలని భావిస్తున్నారు. ఇందుకోసం విష ప్రయోగం చేశారు. మొత్తం 50 మంది బాలికలు విష ప్రయోగం బారినపడ్డారు. ఈ విషప్రయోగం ప్రమాదకరమైనది కాదు. కొన్ని కెమికల్స్‌తో ఈ విషాన్ని తయారుచేశారు. దీనికి పెద్ద చికిత్స కూడా అవసరం లేదు. సాధారణ వైద్యం చేస్తే సరిపోతుంది’’ అని అన్నారు. అంతకుక్రితం విద్యా శాఖ మంత్రి దీనిపై మాట్లాడుతూ.. 50 మంది బాలికలపై విష ప్రయోగం జరిగిందని వచ్చిన వార్తలు కేవలం పుకార్లని అన్నారు. వారంతా అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరారని చెప్పారు.
అయితే, ఆదివారం ఆరోగ్య, విద్యా శాఖలు దీనిపై స్పందిస్తూ.. బాలికలపై విష ప్రయోగం జరగటం నిజమేనని అన్నాయి. కాగా, ఇరాన్‌లో బాలికలపై విష ప్రయోగం జరగటం కొత్తేమీ కాదు. గత డిసెంబర్ నెలలో కూడా కోమ్ సిటీలో బాలికలపై విష ప్రయోగం జరిగింది. బాలికలు స్కూళ్లకు వెళ్లకూడదని కొంతమంది ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆడవాళ్లు కచ్చితంగా హిజాబ్ ధరించాలని దేశ వ్యాప్తంగా నిరసనలు సైతం వ్యక్తం చేశారు. మరి, ఇరాన్‌లో బాలికలు స్కూలుకు వెళ్లకుండా ఉండేందుకు విష ప్రయోగం చేసిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.