అమెరికాలో గన్ సంస్కృతి కోరలు చాచుతోంది. అగ్రరాజ్యంలో ఎప్పుడూ ఏదో ఒక చోట తుపాకీ తూటాల మోత వినిపిస్తూనే ఉంది. పాఠశాలలు, సూపర్ మార్కెట్, రోడ్డు, రహదారులు, పబ్, క్లబ్ అనేక చోట్ల కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఇందులో బాధితులు చిన్నారులు కావడం గమనార్హం.
అగ్ర రాజ్యం అమెరికా ఆయుధ సంపత్తిలో ముందంజలో ఉంటుంది. అక్కడ ఆత్మ రక్షణ పేరుతో గన్‌ను అధికారికంగా వినియోగించవచ్చు. అందుకే అమెరికాలో గన్ సంస్కృతి పెట్రేగిపోతూ ఉంటుంది. ఇటీవల కాలంలో అమెరికా అనేక మరణాలు చోటుచేసుకున్నాయి. పాఠశాలలు, సూపర్ మార్కెట్, రోడ్డు, రహదారులు, పబ్స్ వంటి ప్రాంతాల్లో ఆగంతకులు ఇష్టాను సారంగా కాల్పులు జరపడంతో అనేక మంది అమాయకులు మృతి చెందారు. ఈ మరణాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు కూడా ఉన్నారు. తాజాగా మరో ఘటన ఆందోళనకు గురి చేస్తుంది. ఓ చిన్నారి తన అక్క ప్రాణాన్ని తనకు తెలియకుండానే బలిగొంది. ఈ విషాద ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే హోస్టన్ ప్రాంతంలోని టామ్‌బాల్ పార్క్‌వే సమీపంలోని అపార్ట్‌మెంటులో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో నాలుగు, మూడేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులున్నారు. ఆదివారం ఆ ఇద్దరు చిన్నారులు వారి బెడ్ రూమ్‌లో ఆడుకుంటున్నారు. ఇంతలో తుపాకీ మోత మోగింది. ఈ తుపాకీ మోతతో ఇంట్లోని పెద్దలు ఒక్కసారి ఉలిక్కిపడి, పరుగున వెళ్లి బెడ్ రూమ్‌లో చూడగా..నాలుగేళ్ల చిన్నారి రక్తపు మడుగుల్లో కనిపించింది. మూడేళ్ల చిన్నారి చేతిలో తుపాకీ ఉంది. ఈ విషయం తెలిసిన పోలీసులు విచారణ చేపట్టారు. బొమ్మ తుపాకీ అనుకుని పొరపాటున ఫుల్ గా లోడు చేసిన తుపాకీతో తన అక్కను సోదరి కాల్చినట్లు స్థానిక షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది.
తుపాకీ అంటే ఏంటో తెలియని ఓ మూడేళ్ల పాప దాన్ని ఆట వస్తువుగా భావించి పేల్చినట్లు తెలిపారు. అయితే చిన్నారి చేతిలో తుపాకీ ఉండటం, మరొక చిన్నారి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పోలీసు అధికారి పేర్కొన్నారు. తుపాకీని కలిగి ఉన్నవారు మరింత అప్రమత్తత, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ హత్య ఓ గుణపాఠమని అన్నారు. ఆయుధాలను సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలని సూచించారు. గన్ వినియోగంపై విమర్శలు వినిపిస్తున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదు. అమెరికాలో ఓ ఎన్జీవో చేపట్టిన పరిశోధనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎవ్రీటౌన్ ఫర్ గన్ సేఫ్టీ పేరుతో ఈ పరిశోధన చేపట్టగా.. ప్రతి ఏటా 19,000 మంది పిల్లలు, యువకులు తుపాకీ తూటాలను బలౌవ్వడం, గాయపడుతున్నారని తెలిపింది.