One Sided Love: ప్రేమించిన వ్యక్తి దక్కడన్న ఆవేదనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన సదరు యువతి గొడవలు.. ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇండోర్‌లోని నాగిన్ నగర్‌కు చెందిన శివాని అక్కడి ఓ కాలేజ్‌లో పీజీ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన శానిటరీ షాపు యజమాని దీపక్‌ను ప్రేమించింది. అయితే, దీపక్‌కు అప్పటికే పెళ్లైంది. అయినప్పటికి శివాని వెనక్కు తగ్గలేదు. ప్రేమ పేరుతో అతడి వెంట పడింది. ఈ విషయమై దీపక్ భార్య, శివాని ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంది. తాను దీపక్ రెండో భార్యగా ఉంటానని గొడవ సందర్భంగా శివాని తేల్చిచెప్పింది.
పెద్ద గొడవ తర్వాత కుటుంబసభ్యులు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే విజయ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. కొన్నిరోజుల్లో ఎంగేజ్‌మెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో శివాని ఆత్మహత్య చేసుకుంది. బ్లేడుతో చేతులు, కాళ్లు కోసుకుని, ఆ రక్తంతో సూసైడ్ నోట్ రాసింది. ‘‘నేను నా ఇష్ట ప్రకారమే ఆత్మహత్య చేసుకుంటున్నా. బతికుండగా నీ దాన్ని కాలేకపోయాను. నీకు అప్పటికే పెళ్లయిపోవటం వల్ల ఎవ్వరూ ఒప్పుకోలేదు. నా తల్లిదండ్రులు చాలా మంచివారు. నా తమ్ముడు ధీరజ్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను తప్పుగా అనుకోకు.. ఐ లవ్ యూ దీపక్’’ అని రాసింది. అనంతరం ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భర్తను చంపిన భార్య! చంపటానికి కారణం తెలిసి బిత్తరపోయిన పోలీసులు!