అమ్మాయి ఏ విషయంలోనైనా ఒక్కసారి ‘నో’అందంటే వద్దు అని అర్థమే అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. ఇదే విధమైన తీర్పును ఇటీవల ఓ కోర్టు ఇచ్చింది. అయినప్పటికీ తల్లిదండ్రులు కుమార్తెల అభిప్రాయానికి విలువనివ్వడం లేదు. కాలం మారిన ఇంకా వారిని గుండెలపై కుంపటిగానే చూస్తున్నారు. చివరికీ బాధితురాలిగా మిగిలుతోంది మాత్రం అమ్మాయిలే. అలాగే బలైపోయింది కేరళకు చెందిన 16 ఏళ్ల బాలిక.
తనను బలవంతంగా లొంగదీసుకున్న వ్యక్తితో..తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారా ఆ తల్లిదండ్రులు, అనంతరం ఊచలు లెక్కించారు. ఈ ఘటన తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే 16 ఏళ్ల బాలికపై అమీర్ అనే వ్యక్తి 2021లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టు అయి.. నాలుగు నెలల పాటు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా బాలికపై ఆమె ఇంట్లోనే పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో అతడికే ఇచ్చి తమ కుమార్తెను పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. బాలికను ఒప్పించారు.
ఈ నెల 18న వీరిద్దరికీ పెళ్లి చేశారు. ఆ బాలిక చాలా రోజులుగా స్కూల్ కు రాకపోవడంతో టీచర్లు ఆరా తీయగా ఆమెకు వివాహం చేసినట్లు తెలిసింది. దీంతో స్కూల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను పెళ్లి చేసుకున్న అమీర్, ఈ తంతును జరిపించిన ఉస్తాద్ అన్వర్ సాదత్ తో పాటు బాలిక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అమీర్, వారిపై ఐపిసి, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, అమీర్ కు స్థానిక మాఫియాతో సంబంధాలున్నయని, పలు నేరాలకు పాల్పడ్డాడని, అతడిపైన పలు కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.