స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థల సక్సెస్ వెనుక వేలాది మంది కృషి ఉంది. అందులో ముఖ్యంగా డెలివరీ ఏజెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలుపనేదే లేకుండా ఆర్డర్స్ తీసుకుంటూ, డెలివరీలు చేసుకుంటూ వీళ్లు తెగ కష్టపడుతుంటారు. అలాంటి డెలివరీ ఏజెంట్లకు జొమాటో సంస్థ శుభవార్త అందించింది.
ఫుడ్ డెలివరీ మార్కెట్లో స్విగ్గీ, జొమాటో సంస్థలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యాప్‌లో ఒక్క క్లిక్‌తో వేడివేడి భోజనం ఇంటికి వచ్చేలా చేయడం ఈ సంస్థల స్పెషల్. భోజనం కోసం హోటల్ లేదా రెస్టారెంట్లకు వెళ్లే ఇబ్బందులు వీటితో తగ్గిపోయాయి. బుక్ చేసిన నిమిషాల్లోనే భోజనం సంబంధింత అడ్రస్‌కు డెలివరీ అవడం వెనుక ఫుడ్ డెలివరీ ఏజెంట్స్ కృషి ఎంతో ఉంది. ఉరుకులు, పరుగులు పెడుతూ విశ్రాంతి అనేదే లేకుండా వీళ్లు అందిస్తున్న సేవలు తప్పకుండా మెచ్చుకోదగినవే.
అలాంటి డెలివరీ ఏజెంట్స్‌కు జొమాటో సూపర్ న్యూస్ అందించింది. ఆర్డర్స్ తీసుకోవడం, డెలివరీ చేయడం.. ఇలా బిజీ షెడ్యూల్‌తో డెలివరీ ఏజెంట్స్ సతమతమవుతుంటారు. ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌కు విశ్రాంతి తీసుకునేందుకు తీరిక దొరకదు. ఒకవేళ ఏ కాస్త టైమ్ లభించినా ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ ఏజెంట్ల కోసం ‘రెస్ట్ పాయిట్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కేవలం జొమాటో ఏజెంట్స్ మాత్రమే కాకుండా ఇతర కంపెనీలకు చెందిన ఫుడ్ డెలివరీ ఏజెంట్లు కూడా ఈ రెస్ట్ పాయింట్లనుఉపయోగించుకోవచ్చని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఇప్పటికే రెండు రెస్ట్ పాయింట్లు ఏర్పాటు చేశామని దీపిందర్ తన బ్లాగ్‌లో తెలిపారు. త్వరలో మరికొన్ని చోట్ల రెస్ట్ రూమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
తాగునీరు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్, హై–స్పీడ్ ఇంటర్నెట్, వాష్‌రూమ్స్, 24×7 హెల్ప్‌డెస్క్, ఫస్ట్ ఎయిడ్ లాంటి సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ రెస్ట్ పాయింట్ల ఏర్పాటుతో డెలివరీ ఏజెంట్లు అలసట నుంచి విముక్తి పొంది.. శారీరకంగా, మానసికంగా ఉపశమనం పొందుతారని దీపిందర్ గోయల్ చెప్పుకొచ్చారు. మరి, విశ్రాంతి లేకుండా పనిచేసే డెలివరీ ఏజెంట్స్ కోసం జొమాటో తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.