ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో.. వాహనదారులు విద్యుత్ వాహనాలపై మక్కువ చూపిస్తున్నారు. మధ్యతరగతి వారు కూడా ఎలక్ట్రిక్ టూవీలర్స్ ని కొనేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఓలా, ఏథర్, టీవీఎస్ ఐక్యూబ్, బౌన్స్ ఇన్ఫినిటీ వంటి వివిధ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు టూవీలర్ ఎలక్ట్రిక్ రంగంలో సత్తా చాటుతున్నాయి. అయితే వినియోగదారులు రేంజ్ పై దృష్టి సారిస్తున్నారు. ధర ఎంత ఉన్నా గానీ రేంజ్ బాగుంటే కొనేందుకు వెనకడుగు వేయడం లేదు. అలాంటిది తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహనం వస్తే మాత్రం ఎగబడకుండా ఉంటారా? సేల్స్ లో దుమ్ములేపుతున్న టీవీఎస్ ఐక్యూబ్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు.
కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 150 కిలోమీటర్లు ప్రయాణించాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ. ప్రస్తుతం టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాలు జోరుగా అమ్ముడవుతున్నాయి. వార్షిక కొనుగోళ్లు చూస్తే.. ఏకంగా 1300 శాతానికి పైగా అమ్మకాలు పెరిగాయి. 4 దశాబ్దాలకు పైగా మోటార్ రంగంలో అనుభవం ఉన్న ప్రముఖ టీవీఎస్ కంపెనీ తయారుచేసిన ఎలక్ట్రిక్ వాహనాలపై వాహనదారులు నమ్మకంగా ఉన్నారు. బ్రాండెడ్ మరియు ట్రస్టెడ్ కంపెనీ కావడంతో టీవీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.
గత మూడు, నాలుగు నెలల కాలంలో చూస్తే.. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ టాప్ ప్లేస్ లో నిలిచింది. అదే సమయంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. 2021 నవంబర్ నెలలో కేవలం 699 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా.. 2022 నవంబర్ నెలలో 10,056 యూనిట్లు అమ్ముడయ్యాయి. నవంబర్ లో ఎక్కువగా విక్రయించబడిన టాప్ 10 బెస్ట్ ఈవీ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్ 9వ స్థానంలో నిలిచింది. మిగతా ఎలక్ట్రిక్ కంపెనీల వాహనాలతో పోలిస్తే తక్కువే అయినా.. టీవీఎస్ గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే.. ఇప్పుడు జరుగుతున్న అమ్మకాలు ఎక్కువే. అదే కాకుండా బుకింగ్స్ లో ఇదే జోరు కొనసాగుతోంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనాల విషయానికొస్తే.. ఇది మూడు వేరియంట్లలో వస్తుంది.
టీవీఎస్ ఐక్యూబ్ 100 కి.మీ. రేంజ్ తో గంటకు 78 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఆన్ రోడ్ ధర వచ్చేసి రూ. లక్ష 15 వేల వరకూ ఉంది. ఐక్యూబ్ ఎస్ విషయానికొస్తే.. రేంజ్, వేగంలో ఐక్యూబ్ లానే ఉన్నా అదనంగా కొన్ని ఫీచర్స్ కలిగి ఉంది. ఐక్యూబ్ ఎస్ ధర రూ. లక్ష 21 వేలు ఉంది. వీటి కంటే బెటర్ వేరియంట్.. ఐక్యూబ్ ఎస్టీ. దీని రేంజ్ 145 కి.మీ. కాగా.. గంటకు 82 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర రూ. లక్ష 25 వేలుగా ఉంది. ఛార్జింగ్ విషయానికొస్తే.. మొదటి రెండు వేరియెంట్లు బ్యాటరీ ఫుల్ అవ్వడానికి నాలుగున్నర గంటల సమయం తీసుకోగా.. ఐక్యూబ్ ఎస్టీ మాత్రం 4 గంటల 6 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది.
మరి బ్యాటరీ ఛార్జింగ్ పెడుతున్నాం కదా. కరెంటు బిల్లు వాచిపోదా అన్న అనుమానం కలుగక మానదు. ఆ విషయంలో కూడా కంపెనీ ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలను అధికారిక వెబ్ సైట్ లో పెట్టింది. ఆ లెక్కలు చూసుకుంటే.. టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ కి అయ్యే ఖర్చు ఇలా ఉంది. ఫస్ట్ పెట్రోల్ బైక్ కి అయ్యే ఖర్చు చూస్తే.. మీరు రోజుకి 30 కి.మీ. ప్రయాణం చేస్తున్నారనుకుంటే.. 50 వేల కిలోమీటర్లకు లీటర్ రూ. 100 చొప్పున లక్ష రూపాయలు అవుతుంది. అదే టీవీఎస్ ఐక్యూబ్ మీద 50 వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మీకు అయ్యే ఖర్చు రూ. 6,466 మాత్రమే. అంటే కిలోమీటర్ కి మీకు అయ్యే ఖర్చు రూ. 18.75 పైసలు. ఇదొక్కటే కాకుండా పెట్రోల్ మీద జీఎస్టీ తగ్గుతుంది. దీంతో చాలా డబ్బు ఆదా అవుతుంది.
ఈ లెక్కన 50 వేల కిలోమీటర్ల దగ్గర రూ. 93,500 ఆదా చేసుకోవచ్చు. అలానే మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గుతాయని కంపెనీ తెలిపింది. ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ మూడు వేరియంట్లకి ఖర్చు ఒకేలా ఉంటుంది. ఐక్యూబ్ ఎస్టీ బండి ఛార్జింగ్ పెడితే, బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 4 గంటల 6 నిమిషాల సమయం పడుతుంది. ఈ నాలుగు గంటల 6 నిమిషాలకు అయ్యే ఖర్చు రూ. 18.75 పైసలు. అంటే రూ. 18.75లతో 145 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఇదే 145 కిలోమీటర్లు పెట్రోల్ వాహనం మీద ప్రయాణం చేయాలంటే.. లీటర్ కి 50 కి.మీ.మైలేజ్ ఇచ్చే బైక్ కి అయ్యే ఖర్చు లీటర్ పెట్రోల్ రూ. 100 అనుకున్నా రూ. 300 అవుతుంది. 300 ఎక్కడ? 20 రూపాయలు ఎక్కడ? మీరే ఆలోచించుకోండి.
మీరు రోజుకి 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే.. వారానికి 210 కిలోమీటర్లు. అంటే వారానికి రెండు సార్లు ఛార్జింగ్ పెట్టుకున్నా మీకయ్యే ఖర్చు రూ. 40 లోపే. మిగతా రెండు వేరియంట్లకి కూడా ఇంచుమించు ఇలానే అవుతుంది. కానీ రేంజ్ లో తేడా ఉంటుంది. ఏ కంపెనీ వెహికల్ బ్యాటరీ ఫుల్ అవ్వడానికైనా కనీసం 4 గంటల సమయం పడుతుంది. 4 గంటలకు 4 యూనిట్లు కరెంటు ఖర్చు అవుతుంది. యూనిట్ కి రూ. 6 చొప్పున చూసుకున్నా 24 రూపాయలు అవుతుంది.
పెట్రోల్ ధరతో పోలిస్తే ఇది చాలా తక్కువ, ఉత్తమం కూడా. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఉండదు. మెట్రో రైలులో ప్రయాణించినట్లు సాఫీగా వెళ్లిపోవచ్చు. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ పై మీ అభిప్రాయం ఏమిటి? రూ. 20 లోపు 145 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వాహనంపై మీ అభిప్రాయం ఏంటి? ఐక్యూబ్ మోడల్ ని మీరు టెస్ట్ రైడ్ చేశారా? మీ అనుభూతి ఏంటి? అలానే ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్ ని టెస్ట్ రైడ్ చేశారా? లేక కొనుగోలు చేసి వాడుతున్నారా? మీ అనుభవాలను తోటి వ్యక్తులతో పంచుకోండి. మీ ద్వారా వారు అనేక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.