అందం, అబద్ధపు మాటలతో నిర్మించిన వ్యాపారం బాగా అభివృద్ధి చెందవచ్చు కానీ.. ఎంతో కాలం నిలవదు. ఇందుకు సరైన ఉదాహరణ.. ఎలిజబెత్ హోమ్స్ ఉదంతం. ఎలిజబెత్ టీనేజ్ లోనే స్టార్టప్ రంగలో సంచలనం సృష్టించింది. దీనికి అదనంగా తన అందాన్ని, మాటల్ని ఎరగా వేసి ఇన్వెస్టర్స్ ను ఆకర్షించింది. అంతెందుకు యాపిల్ ఫౌండర్, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ సైతం ఆమె ఉపన్యాసాలకు ఫిదా అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో మూడు పదుల వయసుకి చేరగానే బిలియనీర్గా అవతరించింది. ఇన్నేళ్లకు తన మోసం బయటపడడంతో కటకటాల పాలు కాబోతోంది.అసలు విషయంలోకి వెళ్తే..
దాదాపు పదేళ్ల కిందట.. ఎలిజబెత్ హోమ్స్ అనే 19 ఏళ్ల అమ్మాయి “థెరానోస్” అనే ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించింది. ఇది రోగనిర్ధారణ పరీక్షల రంగంలో సంచలనం సృష్టించింది. కేవలం ఒక్క రక్తపు చుక్కతో బ్లడ్ టెస్ట్ నిర్వహించుకునే సెల్ఫ్ సర్వీస్ మెషిన్లను రూపొందించినట్లు ప్రకటించుకుంది ఎలిజబెత్. కొద్ది చుక్కల రక్తంతో ఫలితాన్ని రాబట్టే మెషిన్లు అవి. ఈ ఆవిష్కరణతో డయాగ్నోస్టిక్స్ ఫీల్డ్లో సరికొత్త విప్లవానికి నాంది పలికిందని ప్రపంచమంతా ఆమెను తెగ పొగిడేశారు.ఆమె ఆ ఆవిష్కరణ తెలివికి ఎంతో మంది మేధావులు ఫిదా అయ్యారు. అన్నింటికి మించి ఆమె అందం, గలగలా మాట్లాడే తత్వం ఇన్వెస్టర్లను ఆకర్షించేది. దీంతో నాలుగేళ్లు కూడా తిరగకుండానే థెరానోస్ స్టార్టప్ కాస్త.. హెల్త్ టెక్నాలజీ కంపెనీగా రిజిస్ట్రర్ అయ్యింది. పెద్ద కంపెనీ సైతం పెట్టుబడులు పెట్టడంతో ప్రభుత్వ వర్గాలు నిఘా పెట్టలేకపోయాయి. ఫోర్బ్స్ తో పాటు పలు పాపులర్ మ్యాగజీన్ల మీద కూడా ఆమె ముఖచిత్రం దర్శనమిచ్చింది.
‘థెరానోస్’ బ్లడ్ టెస్టింగ్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగాక.. 2015లో ఆ కంపెనీ అందిస్తున్న పరికరాలు సరిగా పని చేయడం లేదని వాల్ స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురించింది. అమెరికా ప్రభుత్వం ఆమె కంపెనీపై విచారణ కొనసాగించింది. చివరికి కోర్టు హోమ్స్ను దోషిగా గుర్తించింది. ఇప్పుడు నేరం తీవ్రత ఆధారంగా ఒక్కో అభియోగంపై 20 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడే అవకాశం ఉంది. ఇలా అబద్ధాలతో సాగించిన వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లి చివరికి జైలు పాలు కాబోతున్న ఈ బ్యూటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.