ఓయో రూమ్స్ స్థాపించి రితేశ్ అగర్వాల్ ప్రపంచవ్యాప్తంగా గొప్ప టెక్ ఎంటర్ పెన్యూర్ గా గుర్తింపు సంపాదించారు. ఆయన రెండ్రోజుల క్రితమే గీతాన్ష్ సూద్ ని వివాహమాడారు. ఇంతలోనే ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రెండ్రోజుల క్రితమే ఆయనకు వివాహం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంతలోనే ఆయన తండ్రి రమేశ్ అగర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. మార్చిన 7న గితాన్ష్ సూద్ తో ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో ఘనంగా వీరి వివాహం జరిగింది. రితేశ్ తండ్రి చివరిసారిగా ఆ పెళ్లి వేడుకలోనే అందరికీ కనిపించారు. ఇలా రెండ్రోజుల వ్యవధిలోనే మరణించారని తెలిసి బంధువులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పోలీసులకు ఈ సమాచారం అందినట్లు తెలిపారు. “ఓ వ్యక్తి భవనం పైనుంచి పడిపోయారని పరాస్ ఆస్పత్రికి తరలించారు. మాకు సమాచారం అందడంతో ఆస్పత్రికి వెళ్లాం. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. చనిపోయిన వ్యక్తి పేరు రమేశ్ పర్సాద్ అగర్వాల్ గా తెలిసింది. ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాం” అంటూ పోలీసులు తెలిపారు. తండ్రి దూరం కావడంపై రితేశ్ స్పందించారు.
తనకు మార్గదర్శిగా ఎప్పుడూ స్ఫూర్తి కలిగించే వ్యక్తి ఇకలేరని రితేశ్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి సంపూర్ణ జీవితాన్ని గడిపారని రితేశ్ పేర్కొన్నారు. కుటుంబంతో పాటుగా రోజూ ఎందరికో ఆయన స్ఫూర్తి కలిగించే వారని రితేశ్ గుర్తు చేసుకున్నారు. తండ్రి మరణం తమ కుటుంబానికి తీరని లోటని వెల్లడించారు. తనకు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను తండ్రి చూపిన బాటలో అధిగమిస్తానంటూ రితేశ్ వ్యాఖ్యానించారు. రితేశ్ అగర్వాల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగిన టెక్ ఎంటర్ పెన్యూర్. రితేశ్ వివాహానికి జపనీస్ బిలయనీర్ మసయోషి కుమారుడు కూడా హాజరయ్యారు. ఓయో రూమ్స్ కాన్సెట్ తో రితేశ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. పెళ్లి కాగానే రెండ్రోజులకే రితేశ్ అగర్వాల్ తండ్రిని కోల్పోయారని తెలుసుకుని అభిమానులు, ఫాలోవర్స్ అంతా సంతాపం తెలియజేస్తున్నారు.