ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. ప్రతీ వస్తువు పనికొచ్చేదే. ఆఖరికి వేస్ట్ అని పారేసే వ్యర్థాలతో కూడా పనికొచ్చే వస్తువులను తయారుచేస్తున్నారు. అంతెందుకు టెక్నాలజీ సాయంతో మురికి నీటిని కూడా శుభ్రం చేసి తాగునీటిగా మారుస్తున్నారు. ఆలోచన ఉండాలే గానీ ఏదైనా చేయచ్చు. మనిషి తల వెంట్రుకలతోనే కాదు, కోడి ఈకలతో కూడా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అది కూడా వందలు, వేలు కాదు, లక్షలు కోట్లు. ‘ఏంటి వెటకారమా? కోడి ఈకలతో కోట్లు సంపాదించడమా? ఛాన్సే లేదు. కోడి ఈకల్ని ఎవరు కొంటారు పిచ్చి కాకపోతే’ అని అనుకోకండి. ఇప్పుడూ కోడి పెంట ఉందా? దాన్ని పొలాల్లో ఎరువు కోసం డబ్బు ఎదురిచ్చి కొంటారు. అలానే ఈ కోడి ఈకల వల్ల ఉపయోగం ఉంది కాబట్టే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. కోడి ఈకల బిజినెస్ తో కోట్లు సంపాదిస్తున్న జంట గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు.
జైపూర్ కి చెందిన ముదిత, రాధేష్ శ్రీవాస్తవ దంపతులు.. పెళ్లి కాక ముందు కలిసే చదువుకున్నారు. జైపూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ లో ఇద్దరూ ఎంఏ చేస్తున్న సమయంలో వ్యర్థ పదార్థాలతో పనికొచ్చే వస్తువులను తయారు చేసే ప్రాజెక్టు చేశారు. రాధేష్.. తమ జీవితాన్ని మలుపు తిప్పే సరికొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్న రోజులవి. అలా ఆలోచిస్తూ చికెన్ షాప్ దగ్గర నిలబడినప్పుడు.. కోడి ఈకను చేతితో తాకాడు. అలా తాకిన రాధేష్ కి డింగ్ మని జ్ఞానోదయం అయ్యింది. దీంతో బట్టలు తయారుచేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. వెంటనే ఈ విషయాన్ని ముదితకి చెప్పాడు. ఆమె ఇంప్రెస్ అవ్వడంతో ప్రాజెక్ట్ ని మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది.
నిజానికి రాధేష్ కుటుంబ సభ్యులు శాకాహారులు కావడంతో ఈ బిజినెస్ కి ఒప్పుకోలేదు సరికదా ఎలాంటి సహకారం కూడా అందించలేదు. ఆ సమయంలో రాధేష్, ముదిత దంపతులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయినా గానీ వెనకడుగు వేయలేదు. తమ కలల ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీరి ప్రాజెక్ట్ ని చూసి చాలా మంది ఎగతాళి చేశారు. ఇది వర్కవుట్ అవ్వదు, టైం వేస్టు అంటూ అవమానించారు. అయితే సక్సెస్ అయ్యే ముందు ఇలాంటివి రావడం మామూలే అని అని వాళ్ళు వెనకడుగు వేయకుండా ముందుకే అడుగేశారు. అలా 2010లో ప్రారంభమైన వీరి కలలు ప్రాజెక్ట్ 2018లో పురుడు పోసుకుంది. 8 ఏళ్ల పాటు ప్రాజెక్ట్ గర్భంలో ఉన్న తమ కలకి ప్రతిరూపమే ఇప్పుడు కోట్ల టర్నోవర్ బిజినెస్ చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ వ్యాపారం అప్పటి వరకూ ఎవరూ చేసిన దాఖలాలు లేవు. కోడి ఈకలతో దుస్తులు ఎలా తయారు చేయాలో అన్న సమాచారం కూడా ఎక్కడా దొరకలేదు. చాలా రీసెర్చ్ చేసి ఫైనల్ గా కోడి ఈకల్ని దుస్తులుగా మార్చే టెక్నిక్ ని కనుగొన్నారు. అయితే తయారు చేయడం చేస్తాం, కానీ దాన్ని అమ్మడం ఎలా? అనే విషయం దగ్గర మళ్ళీ ఇద్దరికీ సమస్య వచ్చింది. కోడి ఈకలతో తయారు చేసిన దుస్తుల్ని మనవాళ్ళు పెద్దగా ఇష్టపడరు. ఎలా ఎలా అని బుర్ర బాదుకుంటున్న సమయంలో విదేశాల్లో వీటికి డిమాండ్ ఉందని తెలుసుకున్నారు. కోడి ఈకలతో చేసిన శాలువాలకి విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉందని తెలుసుకుని.. విదేశాలకు ఎగుమతి చేయడం స్టార్ట్ చేశారు.
అలా చిన్న కుటీర పరిశ్రమగా మారిన ఈ ఐడియా.. ఇప్పుడు ఒక పెద్ద పరిశ్రమగా రూపుదిద్దుకుంది. గత రెండేళ్లలో దాదాపు 7 కోట్ల బిజినెస్ చేసిన ఈ కంపెనీ వార్షిక ఆదాయం ప్రస్తుతం రెండున్నర కోట్లుగా ఉంది. ఈ కంపెనీలో 1200 మంది కార్మికులు పని చేస్తున్నారు. మొత్తానికి కాలేజ్ లో గర్భం దాల్చిన ఈ ఆలోచన.. 8 ఏళ్ల తర్వాత పురుడు పోసుకుని.. ఆ బేబీ ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. ఆలోచన, అమలు చేసే ఓపిక, సహనం, తెగువ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఈ దంపతులు ఉదాహరణ. మీకు కూడా ఇలాంటి బిజినెస్ ఐడియాలు ఉంటే వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రొసీడ్ అయిపోండి. ఒకవేళ ఈ బిజినెస్ ఐడియా నచ్చితే మీరు కూడా స్టార్ట్ చేసేయండి.