ఆర్థిక మాంద్యం భయాలతో ఐటీ రంగంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగుల్లో కోతలు విధిస్తున్నాయి. గత కొన్ని నెలల వ్యవధిలో టెక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1.50 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని తెలుస్తోంది. రోజుకో కంపెనీ లేఆఫ్ ప్రకటిస్తుండటంతో సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఆశావహుల్లో వణుకు మొదలైంది.
ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందోనని టెకీలు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త భర్తీలు ఇప్పట్లో చేపట్టే చాన్స్ లేకపోవడంతో జాబ్స్ కోసం ప్రయత్నించే ఆశావహులు నిరాశకు లోనవుతున్నారు. ఇలాంటి సందర్భంలో భారత్‌కు చెందిన ఓ ఐటీ సంస్థ మాత్రం తమ ఎంప్లాయీస్‌కు బహుమతులు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తుండటం విశేషం. గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌లోని త్రిథ్యా టెక్ అనే ఐటీ సంస్థ తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. కంపెనీ ఏర్పాటు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా 13 మంది ఎంప్లాయీస్ కు టొయోటా కార్లను గిఫ్ట్‌గా బహూకరించింది.
ఉద్యోగులు కష్టపడి, శ్రమించి పని చేయడం వల్లే తమకు మంచి ఫలితాలు వచ్చాయని.. వారి వల్లే సంస్థకు లాభాలు పెరిగాయని త్రిథ్యా టెక్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. వారి కృషికి గుర్తింపుగా కార్లు అందజేశామని ఆయన వెల్లడించారు. ఇలాగే పనిచేస్తూ పోతే భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. కాగా, ఈ-కామర్స్, వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ లాంటి టెక్నాలజీ సర్వీసులను త్రిథ్యా కంపెనీ అందిస్తోంది. ఆసియా, యూరప్, ఆస్ట్రేలియాలోని క్లయింట్లకు ఈ సంస్థ సేవలందిస్తోంది. మరి.. పేరుమోసిన బడా ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న వేళ.. ఒక భారతీయ కంపెనీ ఎంప్లాయీస్‌కు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి ప్రోత్సహించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.