YS Jagan Mohan Reddy: జీఎస్‌డీపీలో ఆంధ్రప్రదేశ్ 11.43 శాతం వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. గడిచిన మూడేళ్లలో జీఎస్‌డీపీ వృద్ధిలో మొదటి నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఉందని తెలిపారు. అయినా, చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై తన ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాధించిన జీడీపీ వృద్ధిరేటు మెరుగ్గా ఉండటంతో దుష్టచతుష్టయం ఓర్చుకోలేక పోతోంది. జీడీపీ వృద్ధిలో 6.89 శాతం సాధించి దేశంలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. అదే టీడీపీ హయాంలో ఏపీ 21వ స్థానంలో నిలిచింది.
విభజన నాటికి రాష్ట్రం రుణాలు రూ.1.26 లక్షల కోట్లు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.2.69 లక్షల కోట్లు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 123 శాతం అప్పులు పెరిగాయి. ఈ మూడేళ్లలో రూ.3.82 లక్షల కోట్లకు రుణాలు చేరాయి. ఈ మూడేళ్లలో పెరిగిన రుణం 41.83 శాతం మాత్రమే. ఈ మూడేళ్లలో రాష్ట్రం అప్పులు 12.73 శాతం. ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు బాబు హయాంలోనే ఎక్కువ. 2014లో ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు రూ.14,028 కోట్లు కాగా.. చంద్రబాబు దిగిపోయే నాటికి ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.59,257 కోట్లు. చంద్రబాబు హయాంలో మొత్తం రుణాలు రూ.3.28 లక్షల కోట్లు కాగా.. ఆ ఐదేళ్లలో పెరిగిన రుణాలు 144 శాతం.
ఈ మూడేళ్లలో ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.1. 71 లక్షల కోట్లు. గత అప్పుతో కలుపుకుంటే రుణాలు రూ.4.99 లక్షల కోట్లు ఈ మూడేళ్లలో పెరిగిన రుణం 52 శాతం మాత్రమే. చంద్రబాబు టైంలో కేంద్రం కంటే రాష్ట్ర అప్పులు ఎక్కువ. అప్పుల గురించి రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఎవరి హయాంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. అప్పులు చెల్లించలేని స్థితిలో ఉన్నామని తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్ర సొంత ఆదాయం 75 వేల కోట్ల రూపాయలు. మూలధన వ్యయం తక్కువగా ఉన్నదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడే ఎక్కువ మూలధన వ్యయం ఉంది’’ అని వెల్లడించారు. మరి, రాష్ట్ర అప్పులపై సీఎం జగన్ ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: YS Jagan Mohan Reddy: చంద్రబాబు, ఆయన బ్యాచ్ ప్రజల్లో లేని భయాన్ని సృష్టిస్తున్నారు: సీఎం జగన్