సుమారు 50 మందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన కండక్టర్ డ్రైవర్ని అప్రమత్తం చేయడంతో పెను ముప్పు తప్పింది. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పరవాడ మండలం వాడచీపురుపల్లి నుంచి విశాఖ ఆర్టీసీ బస్టాండ్‌కు 400ఎన్ నంబరు ఆర్టీసీ బస్సు 50 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఇంతలో బస్సు కాన్వెంట్ కూడలి బ్రిడ్జి దగ్గరకు రాగానే.. వెనక చక్రం నుంచి పొగ, మంటలు రావడం గమనించాడు కండక్టర్. వెంటనే దీని గురించి డ్రైవర్ కి చెప్పి అప్రమత్తం చేశాడు.
దాంతో బస్సును పక్కకు ఆపి.. దానిలో ఉన్న ప్రయాణికులను కిందకు దించారు. అనంతరం ఈ సంఘటన గురించి పోలీసులుకు సమాచారం ఇచ్చారు. ఈలోపు బస్సులో మంటలు చెలరేగాయి. ఇలా ఉండగానే అదే రోడ్డు మీద అటు వైపుగా గ్యాస్ సిలిండర్ల లోడుతో లారీ వచ్చింది. అక్కడే ఉన్న హోంగార్డు లారీని గమనించి దూరంగా నిలిపేయడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వత సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
