గడిచిన 24 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన అంశం.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు. అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి వాదనలు ఉన్నా.. ఈ యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉంది. సుమారు 30 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ హెల్త్ యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు.. ఇక్కడ ఎన్ని రకాల వైద్య కోర్సులు అందుతున్నాయి వంటి పూర్తి వివరాలు మీకోసం.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అసలు పేరు ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్. ప్రస్తుతం ఇది ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగరంలో ఉంది. 1986లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఈ యూనివర్సిటీ స్థాపనకు ఆమోదం లభించింది. ఉమ్మడి ఏపీలో ఉండగా.. అనేక కమిటీల సిఫారసు మేరకు ఏపీ శాసన సభ చట్టం 6 ద్వారా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్థాపించబడింది. ఆరోగ్య శాస్త్రాల తొలి యూనివర్సిటీగా ఇది గుర్తింపు పొందింది. వైద్య శాస్త్రంలో అన్ని కోర్సులలో ఒకే విధమైన పరిశోధన, ఏకరీతి పాఠ్యప్రణళికను అమలు చేయడంతో పాటు.. వైద్య విద్య ప్రమాణాలు మెరుగుపర్చడం ఈ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యం.
1986లో ఆంధ్రప్రదేశ్ యునివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా ప్రారంభమయిన ఈ విశ్వవిద్యాలయం పేరును.. 1998లో టీడీపీ హయాంలో మార్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని స్థాపించడంతో.. ఈ యూనివర్సిటీకి ఆయన పేరును పెట్టారు. ఈ క్రమంలో 1998, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఈ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయంగా పిలుస్తున్నారు. ప్రారంభంలో ఈ కాలేజీ భవనం కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉండేది. కానీ 2002 సంవత్సరం తర్వాత దీన్ని ప్రస్తుతం ఉన్న భవనంలోకి మార్చారు. దీనికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లభించింది.
నీట్లో ర్యాంక్ సాధించిన వారికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ లభిస్తుంది. అలానే ఎంసెట్‌లో ర్యాంక్ ఆధారంగా ఇక్కడ కన్వీనర్ కోటా అడ్మిషన్‌తో పాటు పారామెడిక్స్ అనుబంధ, ఫార్మా కోర్సులకు అడ్మిషన్ లభిస్తుంది. ఇక ఈ విశ్వవిద్యాలయంలో ఆధునిక వైద్యంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, సూపర్-స్పెషాలిటీ కోర్సులను అందిస్తుంది. అలానే దంత శస్త్రచికిత్స, నర్సింగ్, ఆయుర్వేదం, హోమియోపతి, యునానిలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ కోర్సులు.. నేచురోపతి, ఫిజియోథెరపీ, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు, అలాగే అప్లైడ్ న్యూట్రిషన్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎంఎస్సీ) అందిస్తుంది.
విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పటి నుండి దానికి అనుబంధంగా ఉన్న కళాశాలల సంఖ్య ఇరవై ఏడు నుండి 184కి పెరిగింది. విశ్వవిద్యాలయం అందించే డిగ్రీలు.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడిసిన్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సహా సహా వృత్తిపరమైన చట్టబద్ధమైన సంస్థలచే గుర్తింపు పొందాయి. సుమారు 30 ఏళ్లుగా ఎందరో ప్రతిభావంతులూన వైద్య నిపుణులను తయారు చేస్తూ.. ప్రజలకు సేవలు అందిస్తుంది ఈ యూనివర్సిటీ. పేరు మార్పు వివాదంతో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంలో తెలియజేయండి.