పాకిస్తాన్ కు చెందిన గుల్జార్ ఖాన్ అనే పౌరుడికి ఏపీలోని నంద్యాలకు చెందిన ఓ మహిళ రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయింది. దీంతో ఇద్దరు అలాగే కొంత కాలం పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారు. అలా కొన్నాళ్ల పరిచయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక గుల్జార్ ఖాన్ ఎలాగైన భారత్ లోకి అడుగు పెట్టి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. గుల్జార్ ఖాన్ తో పెళ్లికి ఆ మహిళ కూడా అంగీకరించింది. అయితే గుల్జార్ ఖాన్ పాకిస్తాన్ నుంచి ఇండియాకు చేరుకుని ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడా? ఇంతకు గుల్జార్ ఖాన్ ఇండియాలోకి ఎలా వచ్చాడు? ఈ లవ్ స్టోరీలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పాకిస్తాన్ పౌరుడైన గుల్జార్ ఖాన్ అనే వ్యక్తికి 2010లో ఏపీలోని నంద్యాల జిల్లా గుడివేములకు చెందిన దౌలత్ బీ అనే మహిళ రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయింది. దౌలత్ బీకి గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, ఆ మహిళ భర్త గతంలో మరణించాడు. అయినా సరే.. వీళ్లిద్దరూ తరుచు ఫోన్ లో మాట్లాడుకునేవారు. రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ప్రియురాలు దౌలత్ బీని.. ఎలాగైన కలుసుకోవాలని గుల్జార్ ఖాన్ అనుకున్నాడు. అయితే సౌదీ అరేబియాలో పెయింటర్ గా పని చేస్తున్న గుల్జార్ ఖాన్.. 2011లో అక్రమంగా ముంబాయిలోకి అడుగు పెట్టాడు. గుల్జార్ ఖాన్ నేరుగా అక్కడి నుంచి ఏపీలోని నంద్యాలకు చేరుకుని ఎట్టకేలకు ప్రియురాలు దౌలత్ బీని కలుసుకున్నాడు.
ఇక ఇంతటితో ఆగకుండా ఆమెను 2011 జనవరి 25న పెళ్లి కూడా చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి గుల్జార్ ఖాన్ గుడివేములలోనే భార్యతో కాపురం పెట్టాడు. అలా కొన్నేళ్లు గడిచాక ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే గుల్జార్ ఖాన్ ఎలాగో ఆధార్ కార్డును కూడా పొందాడు. దీని ద్వారా తన భార్యా పిల్లలను తీసుకుని స్వదేశం అయిన పాకిస్తాన్ కు వెళ్లాలనుకున్నాడు. ఇందులో భాగంగానే గుల్జార్ ఖాన్ 2019లో భార్యాపిల్లలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. కానీ, ఎయిర్ పోర్ట్ అధికారులు గుల్జార్ ఖాన్ పాకిస్తాన్ పౌరుడని, ఇతడు ఇండియాలోకి అక్రమంగా వచ్చాడని తేల్చారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో అతని భార్య దౌలత్ బీ తిరిగి మళ్లి నంద్యాలకు చేరుకుంది.
భర్త జైల్లో ఉండడంతో తన పిల్లల పోషణకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంది. స్థానికంగా ఏదో పని చేస్తూ దౌలత్ బీ తన పిల్లలను పోషించింది. అయితే గుల్జార్ ఖాన్ అరెస్ట్ అయిన 6 నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతడు ఏడాది పాటు తన భార్యాపిల్లలతో కలిసి ఉన్నాడు. కట్ చేస్తే అధికారులు మారోసారి గుల్జార్ ఖాన్ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. భర్తను మరోసారి జైలుకు తరలించడంతో భార్య దౌలత్ బీ అయోమయంలో పడిపోయింది. నా భర్తను జైలుకు తరలించడంతో.. పిల్లల పోషణ చాలా కష్టంగా మారిందని, ఎలాగైన నా భర్తను విడుదల చేయాలంటూ దౌలత్ బీ అధికారుల చుట్టు తిరుగుతోంది. ఇదే అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. నంద్యాల మహిళ! పాకిస్థాన్ ప్రియుడు! ఇలా 9 ఏళ్లు పాటు సాగిన ఈ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.