విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంత పార్టీ టీడీపీకి సవాలు విసిరే వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీడీపీ ఏ పిట్టల దొరకు సీటు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఏ పిట్టల దొరకు సీటు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తనకు టిక్కెట్టు ఇస్తుందా? లేదా? తాను ఎంపీ అవుతానా? లేదా? అన్న భయం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. తన మనస్తత్వానికి సరిపోతే.. ఏ పార్టీ అయినా తనకు ఓకే అని తేల్చి చెప్పారు. తాను చేసే వ్యాఖ్యల్ని పార్టీ ఏ విధంగా తీసుకున్నా తనకు భయం లేదన్నారు. తనకు మంచి ట్రాక్ ఉందని, తాను చేసినన్ని అభివృద్ధి పనులు దేశంలో ఏ ఎంపీ చేయలేదని తెలిపారు.
ప్రజలంతా కోరుకుంటే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానేమోనన్నారు. కాగా, గత కొన్నేళ్లుగా ఎంపీ కేశినేని నాని టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. టీడీపీ అసమ్మతి నేతగా మారారు. అవకాశం చిక్కినపుడల్లా టీడీపీలోని కొంతమంది నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ఇక, ఎన్నికలకు కొన్ని నెలలే ఉండటంతో అధికార వైఎస్సార్ సీపీ నానిని పార్టీలోకి తెచ్చుకునే పనిలో పడింది. ఈ మేరకు ఆయన్ని మచ్చిక చేసుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కేశినేని నాని ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి నందిగామ నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేను తెగ పొగిడారు. దీంతో నాని వైఎస్సార్ సీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి సయమంలో నాని టీడీపీకి సవాలు విసిరే వ్యాఖ్యలు చేయటం.. తన మనస్తత్వానికి సరిపోతే.. ఏ పార్టీ అయినా తనకు ఓకే అనటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి, కేశినేని నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.