ప్రేమకు పెద్దలు అడ్డుంకులు కల్పించటం తరతరాలుగా యుగయుగాలుగా జరుగుతూ ఉంది. లైలా మజ్ను, పారు దేవాదాసు వంటి భగ్న కథల్లో పెద్దలే విలన్లుగా ఉన్నారు. నిజజీవితంలోనూ పెద్దలు ప్రేమ కథలకు విలన్లుగా మారుతున్నారు.
ప్రేమకు.. ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు ఎప్పుడూ అడ్డే అని ప్రేమికులు భావిస్తూ ఉంటారు. ‘ మీ పెద్దాలున్నారే.. మా పిల్లల మనసుల్ని ఎప్పుడూ అర్థం చేసుకోరు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు.. అలా కాకపోతే ప్రాణాలు తీసుకునే వాళ్లు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అయితే, పారిపోయి పెళ్లిళ్లు చేసుకున్న వారి సంగతి కొంచెం బాధాకరం. కుటుంబసభ్యులు ఎప్పుడు.. ఏం చేస్తారోనన్న భయంతో బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా జంటలు పోలీసులను సహాయం కోరుతుంటాయి.
తమకు రక్షణ కల్పించమని అడుగుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంట కూడా తమకు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన కాజ గజపతి.. అనంతపల్లిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతడికి కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని గూడురుకు చెందిన సంకుల గాయత్రితో ఫేస్‌బుక్లో పరిచయం ఏర్పడింది. ఆమె బీఎస్సీ పూర్తిచేసి మంగళగిరిలోని ఓ కంప్యూటర్ సంస్థలో పనిచేస్తోంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండున్నరేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ వారి పెద్దలు బయటి సంబంధాలు చూస్తున్నారు. తమ కులాలు వేరు కావటంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని భావించారు. దీంతో ఇంట్లోంచి పారిపోయారు. శనివారం అన్నవరం గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి గాయత్రి తల్లిదండ్రులు బెదిరింపులకు దిగారు. చంపేస్తామని బెదిరించారు. పెద్దల బెదిరింపులతో భయపడిపోయిన జంట పోలీసులను ఆశ్రయించింది. తమకు రక్షణ కల్పించమని కోరింది. పెద్దల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.