మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ గుంటూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా టికెట్ల పేరిట వసూళ్లకు పాల్డుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఈ ఆదేశాలు జారీ చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి పేరిట లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారని జనసేన నేతలు ఆరోపణలు చేశారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్తే వారు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు తీసుకోలేదనే కోర్టుకి వెళ్లామంటున్నారు.
జనసేన నేతలు గుంటూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లా కోర్టు మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మంత్రి పేరిట ఎవరో ఇలా కావాలనే చేసి ఉండచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇంకా మంత్రి అబటి రాంబాబు, ఆయన తరఫున ఏ అధికార ప్రతినిధులు ఈ విషయంపై స్పందించలేదు. ఆయన స్పందిస్తే ఈ వ్యవహారంపై మరింత అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది.