వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పున:ప్రారంభం కానున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని స్కూల్ టైమింగ్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది.
వేసవి సెలవుల్లో ఆనందంగా గడిపిన విద్యార్థులకు తిరిగి పాఠశాలలకు వెళ్లాల్సిన టైమ్ వచ్చింది. ఏప్రిల్ నెల చివరి వారం నుంచి ప్రారంభమైన సమ్మర్ హాలిడేస్ జూన్ 11 తో ముగియనున్నాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. అయితే ఇప్పటికే తీవ్ర ఎండలతో భానుడు హడలెత్తిస్తున్నాడు. జనాలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఇలాంటి తరుణంలో పిల్లలను స్కూల్ కు పంపించాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. విపరీతమైన ఎండ వడగాలులతో తమ పిల్లలు అనారోగ్యానికి గురవుతారని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకొన్ని రోజులు సెలవులు పొడిగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎండల తీవ్రత దృష్ట్యా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రప్రభుత్వాలు వేసవి సెలవులను కొన్ని రోజులు పొడిగించాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వేసవి సెలవుల పెంపు పై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని అందరు భావించారు. జూన్ 12 నుంచి స్కూల్స్ ప్రారంభం అవనున్న నేపథ్యంలో ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల కారణంగా జూన్ 17వ తేదీ వరకు ఒక్క పూట బడులను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 7:30 గంటల నుంచి 11: 30 గంటల వరకు పాఠశాలలు నడుస్తాయని వెల్లడించింది. ఆ తరువాత అనగా 19వ తేదీ నుంచి పాఠశాలలు విద్యాశాఖ ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయిలో బడి వేళలు కొనసాగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. ఎండల కారణంగా విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల వినతులు, నిపుణుల సలహాలమేరకు ఎపి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.