పిల్లలే లోకంగా బతుకుతారు తల్లిదండ్రులు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే.. తల్లిదండ్రులు విలవిల్లాడతారు. నవ మాసాలు తల్లి కడుపులో ఉండి.. భూమ్మీదకు వచ్చిన బిడ్డ.. బోసి నవ్వులు చూసి తల్లిదండ్రులు సంతోషిస్తారు. బుడి బుడి అడుగులు వేస్తూ.. వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దుగా పలికే మాటలు వింటూ మురిపిపోతారు. వయసుతో పాటు పిల్లల ఎదుగుదల చూసి సంతోషిస్తారు. కానీ దురదృష్టవశాత్తు.. వయసు పెరుగుతున్న కొద్ది.. పిల్లల తీరులో మార్పు లేకపోతే.. చిన్న వయసులోనే అరుదైన వ్యాధి బారిన పడి.. అవస్థ పడుతుంటే ఆ తల్లిదండ్రి అనుభవించే గుండె కోత గురించి వర్ణించడానికి మాటలు చాలవు.
ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఆ తల్లిదండ్రులు. భార్యాభర్తిలద్దరూ కాయకష్టం చేసుకుని బతికేవారు. వారికి ఇద్దరు సంతానం. రెండో కుమారుడు పుట్టినప్పుడు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ రాను రాను అతడి శరీరంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోసాగాయి. చిన్నారి శరీరంలో తల రోజు రోజుకు పెరుగుతూ.. ఆ బిడ్డకు మోయలేని భారంగా మారుతుంది. మూడేళ్ల ఆ చిన్నారి బరువు 15 కేజీలు కాగా.. దానిలో కేవలం తర బరువు మాత్రమే 10 కిలోలు. మెరుగైన వైద్యం అందించే స్థోమత లేక.. బిడ్డ పరిస్థితి చూసి కుమిలిపోతున్నారు. తమను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ సమస్యను సుమన్‌టీవీ వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు..
పశ్చిమ గోదావరి జిల్లా.. ఆల్లమూరులో జయరాజు, సలోమీ దంపతులకు ఇద్దరు బిడ్డలు. జయరాజు కార్పెంటర్‌గా పని చేసి.. భార్యాబిడ్డలను పోషించేవాడు. ఇక జయరాజు దంపతులకు రెండో సంతానంగా విన్విత్ అనే కుమారుడు పుట్టాడు. పుట్టినప్పుడు చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ మూడో నెల నుంచి తల భాగం పెరగడం ప్రారంభం అయ్యింది. తలకు నీరు పట్టి.. మెదడు ఎదుగుదల ఆగిపోయింది. దాంతో వైద్యులు బాబుకు 7, 11 నెలల వయసులో ఆపరేషన్ చేశారు. సమస్య తగ్గకపోగా.. రోజు రోజుకు పెరగసాగింది. బాబు హైడ్రో సఫలియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
అయితే నాలుగు నెలల క్రితం బెగంళూరు వెళ్లి బాబుని చూపించగా.. తల తగ్గే అవకాశం ఉంది కానీ.. పూర్తిగా భరోసా ఇవ్వలేమని తెలిపారు వైద్యులు. అది ప్రైవేట్ ఆస్పత్రి కావడంతో.. ఆ ఖర్చులు తాము భరించలేమని తిరిగి వచ్చేశారు. అలానే ఆపరేషన్ చేసినా బాబు బతుకుతాడనే గ్యారెంటీ లేదని.. ఒకవేళ తమ అదృష్టం బాగుండి.. సర్జరీ సక్సెస్ అయితే.. బాబు తల తగ్గే అవకాశం ఉందని తెలిపారు. కానీ తమకు అంత ఆర్థిక స్థోమత లేదని.. దాతలు ఎవరైనా ఆదుకోవాలని కోరుతున్నారు. బాబు కనీసం కూర్చోలేడని.. తల కూడా తిప్పలేడని.. కనీసం సరిగా చూడలేడని చెబుతూ.. విన్విత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. దాతలు ఎవరైనా తమకు సాయం చేయాలని కోరుతున్నారు.