ఇటివల పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీ.. ఇటు ఏపీ రాజకీయాల్లో పెద్ద రగడ రాజేసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా పేర్నినాని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి గట్టిగానే సమాధానం ఇస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సార్వత్రిక ఎన్నికలను సైతం తలదన్నే విధంగా మా ఎన్నికల హడావుడి నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సినీ ఇండస్ట్రీల్లో కొన్ని వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఓడించి.. తమకు అనుకూలంగా ఉండే మంచు విష్ణు ప్యానల్ గెలుపు కోసం ఏపీ ప్రభుత్వం సహకరిస్తోందనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు గెలుపు కోసం పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య మాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎవరికి వాళ్లే ఈ ఎన్నికల్లో గెలుపు తమది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మా ఎన్నికల విషయం గురించి మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. మా ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మా ఎన్నికలపై తమకు ఉత్సాహం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ, సీఎం జగన్‌కు మా ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని పేర్ని నాని చాలా క్లారిటీగా చెప్పేశారు.