ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురుపూజోత్సవం ప్రత్యేకత, మన జీవితాల్లో గురువుకున్న ప్రాధన్యత గురించి గొప్పగా వివరించారు. ఇక రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అలాగే రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎలా ఉండాలో తన మనసులోని ఆకాంక్షను వెల్లడించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
“సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి. మనం సాన పెట్టకపోతే వజ్రం కూడా సాధారణ రాయితో సమానమే. ఉపాధ్యాయులే విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయగలరు. వారిని తీర్చిదిద్దే శక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉంటుంది. నాకు విద్య నేర్పించిన గురువులందరికీ రుణపడి ఉంటాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా విద్యార్థులను పూర్తిగా సిద్ధం చేయాలని మా ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచి.. వాటిని ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో సంస్కరణలు ప్రవేశపెడుతున్నాం. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే పరిస్థితి వస్తుంది” అంటూ సీఎం జగన్ ఆకాంక్షించారు.

అటు ప్రతిపక్షంపై సీఎం జగన్ మండిపడ్డారు. ఉపాధ్యాయులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గత ప్రభుత్వాలు విద్య, వైద్యం, రవాణా వంటి రంగాల్లో ప్రభుత్వ విభాగాలను బలహీనపరిచాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రైవేట్ రంగానికి మారారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ ట్రెండ్‌ని రివర్స్ చేసింది” అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అలెగ్జాండర్ ది గ్రేట్‌ని ఉటంకిస్తూ.. ‘‘తనకు జన్మనిచ్చినందుకు తన తండ్రికి కృతజ్ఞతతో ఉంటాడు.. అలానే తన జన్మను సార్థకం చేసినందుకు తన గురువుకు మరింత కృతజ్ఞతతో ఉంటాడు’’ అని తెలిపారు.
అంతేకాకుండా గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పురస్కారాలను సీఎంజగన్ ప్రదానం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సీఎం జగన్ సత్కరించారు. పాఠశాల విద్య నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్ విద్య నుంచి 19 మందిని ఎంపిక చేశారు. అలాగే ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ఒక ముగ్గురితోపాటు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకున్నారు.
