టాలీవుడ్ లో విశాల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రేమ చదరంగం, పందెం కోడి, పొగరు, భరణి, అభిమన్యుడు, డిటెక్టివ్ వంటి సినిమాలతో కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విశాల్.. తాజాగా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా కాలంగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేని విశాల్.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాని విపరీతంగా ప్రమోట్ చేశారు. సునైన హీరోయిన్ గా, ప్రభు కీలక పాత్రలో నటించగా.. ఎ. వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఆశించిన విజయాన్ని నమోదు చేసుకుందా? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.
మురుగానందం (విశాల్) ఉద్యోగం అంటే అంకితభావంతో పని చేసే ఒక కానిస్టేబుల్. లాఠీ స్పెషలిస్ట్ గా పేరు పొందిన మురుగానందం.. ఎవ్వరికీ తలవంచని నైజంతో పని చేస్తుంటాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముక్కుసూటిగానే వ్యవహరించే స్వభావం అతనిది. అలాంటి కానిస్టేబుల్ ఒక పెద్ద వ్యక్తి కొడుకుని కొట్టాల్సి వస్తుంది. లాఠీ ఛార్జ్ చేయమని పై అధికారులు చెప్పడంతో లాఠీతో ఉతికి ఆరేస్తాడు. ఈ క్రమంలో అతను సమస్యల్లో ఇరుక్కుంటాడు. అప్పటికే కవితతో (సునైన) వివాహం జరిగి, పదేళ్ల కొడుకు కూడా ఉంటాడు. అయితే అనుకోకుండా నిర్మాణం జరుగుతున్న భవనంలో మురుగానందం, అతని కొడుకు ఇద్దరూ ఇరుక్కుపోతారు. ఒక ముఠా వీళ్ళని చుట్టుముడుతుంది. లాఠీ తప్ప మరే ఆయుధం లేకుండా ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ లాఠీ కథ.
ఎక్కడ ఏ గొడవ జరిగినా ముందు బలి అయ్యేది కింద స్థాయి వాళ్ళే. అలానే పెద్ద పెద్ద ఆఫీసర్ల కింద పని చేసే కానిస్టేబుళ్లు కూడా కొన్ని సార్లు బలైపోతారు. క్రిమినల్స్ తో నిజం చెప్పించడానికి, నిరసనల్లో పాల్గొనే వ్యక్తులను కొట్టడానికి లాఠీ వాడతారు. కానీ అదే లాఠీని.. సమాజంలో పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తిని కొట్టడానికి వాడితే మాత్రం ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ అంటే పెద్ద గౌరవం ఉండదు. ప్రాణం పోయినా పెద్ద పట్టించుకోరు అన్న పేరు ఉంది. అలాంటిది నిజాయితీగా ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసే కానిస్టేబుల్ పాత్రలో విశాల్ నటన చాలా బాగుంటుంది.
సెల్యూట్, జయసూర్య, అయోగ్య లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విశాల్.. కానిస్టేబుల్ పాత్రలో ఆకట్టుకుంటారో? లేదో అన్న అనుమానాలకు తావివ్వకుండా చాలా అద్భుతంగా నటించారు. కానిస్టేబుల్ అంటే సీనియర్ నటుల్ని లేదా హాస్యనటుల్ని పెట్టి.. పొట్ట చూపిస్తూ కామెడీ క్రియేట్ చేయడమే తెలుసు. కానీ అవేమీ లేని కానిస్టేబుల్ కూడా హీరోనే అని విశాల్ అండ్ దర్శకుడు వినోద్ కుమార్ నిరూపించారు. ఇక కానిస్టేబుల్ భార్య కవిత పాత్రలో సునైన, కొడుకుగా మాస్టర్ లిరిష్ రాఘవ్ బాగా నటించారు. సీనియర్ నటుడు ప్రభు, మునిష్కాంత్, తలైవాసల్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో బాగా నటించారు.
కథ విషయానికొస్తే.. పూర్తిగా కమర్షియల్ సినిమా. ఫస్ట్ హాఫ్ లో కొత్తదనం ఉండదు. చాలా సన్నివేశాలు రొటీన్ గా ఉంటాయి. అయితే సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో వచ్చే సంఘర్షణ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు కథలో లీనమయ్యేలా చేస్తాయి. సాంకేతిక వర్గం పనితీరు విషయానికొస్తే.. దర్శకుడు కొత్త వాడే అయినా బానే హ్యాండిల్ చేశారు. అయితే కొన్ని రొటీన్ సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. డ్రామాతో నిండిన యాక్షన్ సీక్వెన్స్ లతో చివరి వరకూ ప్రేక్షకులని కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యారు. బాల సుబ్రమణియన్, బాలకృష్ణ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. పీటర్ హెయిన్ యాక్షన్ సీక్వెన్సులు అబ్బురపరుస్తాయి. సినిమాకి ఈ యాక్షన్ ఎపిసోడ్సే హైలైట్. ఇక యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాత్రం కొన్ని సీన్స్ ని అలా అలా పైకి లేపారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.