తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని కోలీవుడ్ హీరోలలో కార్తీ ఒకరు. యుగానికి ఒక్కడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కార్తీ.. ఆ తర్వాత ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖైదీ, సుల్తాన్ సినిమాలతో మరింత దగ్గరయ్యాడు. అయితే.. కార్తీ సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. కానీ.. రీసెంట్ గా నటించిన ‘విరుమాన్’ చిత్రాన్ని మాత్రం కేవలం తమిళం వరకే థియేటర్స్ లో విడుదల చేశారు. తమిళంలో మంచి హిట్ అనిపించుకున్న ఈ విరుమాన్ సినిమాను తాజాగా అమెజాన్ ప్రైమ్ లో ‘పసలపూడి వీరబాబు’ పేరుతో ఓటిటి రిలీజ్ చేశారు. ముత్తయ్య తెరకెక్కించిన ఈ సినిమాతో డైరెక్టర్ శంకర్ కూతురు అతిథి హీరోయిన్ గా డెబ్యూ చేసింది. మరి పసలపూడి వీరబాబు మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
ఈ సినిమా కథ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. వీరబాబు(కార్తీ)కు తండ్రి భూపతి(ప్రకాష్ రాజ్) అంటే చిన్నప్పటి నుండి పడదు. ఎందుకంటే.. తన తల్లి చావుకు కారణం తండ్రేనని భావించి.. చిన్నప్పుడే అతనిపై హత్యాయత్నం చేస్తాడు. దీంతో తండ్రిని చంపకూడదని కోర్టు తీర్పు ఇవ్వడంతో.. తనకు తండ్రి భూపతితో ఉండటం ఇష్టం లేదని మావయ్య(రాజ్ కిరణ్) వద్ద పెరుగుతాడు. కాలంతో పాటు వీరబాబులో తండ్రిపై కోపం కూడా పెరుగుతూ వస్తుంది. ఎలాగైనా తండ్రికి బుద్ధిచెప్పి, తన తల్లి గొప్పదనాన్ని తెలియజేయాలని నిర్ణయించుకుంటాడు. మరి తండ్రి భూపతికి వీరబాబు ఎలా బుద్ధి చెప్పాడు? అసలు వీరబాబు తల్లి ఎలా చనిపోయింది? మధ్యలో ఈ రేణుక(అతిథి) పాత్ర ఏంటి? చివరికి వీరబాబు ఏం సందేశం ఇచ్చాడనేది సినిమాలో చూడాల్సిందే.
టాలీవుడ్ లో ఇప్పటివరకు తండ్రీకొడుకుల వైరం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. తండ్రీకొడుకుల వైరంతో ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీస్, ఫ్యాక్షన్.. కామెడీ ఇలా చాలా జానర్స్ లో సినిమాలు వచ్చాయి. అయితే.. ఈ పసలపూడి వీరబాబు కథ కూడా అదే కోవలో చేరుతుంది. చిన్నతనంలో తల్లి చావును కళ్లారా చూసిన వీరబాబు.. తండ్రే చంపాడని చెప్పి అతనిపై హత్యాయత్నం చేయడంతో సినిమా మొదలవుతుంది. అసలు సినిమా కథేంటి? వీరబాబు లక్ష్యం ఏంటనేది ఏమాత్రం దాచకుండా మొదట్లోనే చెప్పేశాడు దర్శకుడు. అయితే.. గ్రామీణ నేపథ్యం కలిగిన సినిమాలలో ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని దాదాపు ఒకేలా ఉండటం చూస్తుంటాం.
ఈ సినిమాలో కూడా అదే జరిగింది. తన తల్లిని చంపాడని ఫిక్స్ అయిపోయి తండ్రిపై పగ పెంచుకున్న వీరబాబు.. తండ్రికి ఎలా బుద్ధి చెప్పాడనేది మిగిలిన కథ. ఇది సినిమా ఆరంభంలోనే చెప్పినా.. గ్రామంలో గొడవలు.. అన్నదమ్ముల, మావయ్యల సెంటిమెంట్.. విలేజ్ లోనే ప్రేమకథ.. నాలుగు ఫైట్స్ ఇలా రొటీన్ వెర్షన్స్ లోనే వీరబాబు కథను నడిపించాడు దర్శకుడు. అయితే.. ఈ ఎమోషన్స్ అన్నీ గతంలోనే చూసినప్పటికీ, ఇప్పుడు ఎక్కువగా తమిళ ఫ్లేవర్ కలిగిన సినిమాలలోనే కనిపిస్తుంటాయి. కానీ.. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ ముత్తయ్య తన రెగ్యులర్ ఓల్డ్ ఫార్మాట్ లోనే సెంటిమెంట్ సీన్స్ రాసుకున్నాడు. కథనే పాత అనుకుంటే.. ఎమోషన్స్ లో కూడా కొత్తదనం లేకపోయేసరికి వీక్షకులకు బోర్ ఫీలింగ్ కలగవచ్చు.
అసలే రొటీన్ కథ.. అదికూడా అందరూ అన్ని భాషలలో చూసేసిన తండ్రీకొడుకుల వైరం కాన్సెప్ట్. అరగదీసిన కథనే మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు.. ఏమాత్రం కొత్త పాయింట్ లేకుండా ప్రెజెంట్ చేయడం గమనార్హం. ఎమ్మార్వో అయిన తండ్రికి కొడుకు బుద్ధి చెప్పడమే సినిమా. అయితే.. ఈ సినిమాలో ఒక్క చోట కూడా ఉత్కంఠ రేపే సన్నివేశాలు, కొత్తగా ఉందని అనుకునే లవ్ సీన్స్.. ఎక్కడా కనిపించవు. బట్ ఎమోషనల్ గా మూవీ చివరి వరకు కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. మనవాళ్ళు ఓటిటిలో, టీవీలో అయినా ఎమోషన్స్ కి ఎక్కువగా వాల్యూ ఇస్తుంటారు. ఫ్యామిలీ డ్రామాకు ఈ సినిమాలో కొదవలేదు.
ఇక వీరబాబు పాత్రలో కార్తీ ఒదిగిపోయాడు. కార్తీకి విలేజ్ బాయ్ రోల్స్ కొట్టినపిండి. గతంలో చిన్నబాబు, మల్లిగాడు, రీసెంట్ గా సుల్తాన్ లాంటి సినిమాలతో మెప్పించాడు. ఇక అతిథి శంకర్ డెబ్యూ అయినా ఎక్సప్రెషన్స్ బాగా పలికించింది. తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్, మావయ్య పాత్రలో రాజ్ కిరణ్ ఇలా అందరూ తమతమ పాత్రల పరిధిమేరా ఆకట్టుకున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బాగుంది. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ పెద్దగా ఎక్కవనే చెప్పాలి. ఇక విలేజ్ వాతావరణం, సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ.. ఎడిటర్ కాస్త కత్తెరకు పనిచెప్పాల్సిందే అనిపిస్తుంది. ఈ సినిమాను కార్తీ అన్న, వదిన సూర్య – జ్యోతిక నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ ముత్తయ్య తన ఫ్యామిలీ డ్రామా ఫార్ములా నుండి బయటికి రాలేదు. ఓటిటిలో కాబట్టి వీరబాబు ఆకట్టుకునే అవకాశం ఉంది.
Rating: 1.5/5