తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘జీ కర్ధా’ జూన్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న నాటి స్నేహితులు పెద్దయ్యాక వారి జీవితాల్లో చోటుచేసుకునే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
ఈ మధ్యకాలంలో సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్‌ల హవా పెరిగిపోయింది. థియేటర్‌లలో సినిమాలు చూడని వారు కూడా మొబైల్‌లో.. ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం ఓటీటీకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా.. వెబ్ సిరీస్ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా విషయం అయితే, ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె ఓటీటీలో వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తున్నారు. తమన్నా నటించిన తాజా వెబ్ సిరీస్ జీ కర్ధా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
లావణ్యా సింగ్ (తమన్నా), రిషబ్ రాథోడ్ (సుహైల్ నయ్యర్), అర్జున్ గిల్ (ఆశిమ్ గులాటీ), ప్రీత్ (అన్యా సింగ్), షీతల్ (సంవేదన), షాహిద్ (హుస్సేన్ దలాల్), మెల్రాయ్ (సయాన్ బెనర్జీ) స్కూల్ మేట్స్. చిన్నప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఏం చేసినా కలిసే చేస్తుంటారు. 15 ఏళ్ల తర్వాత లావణ్యా సింగ్, రిషబ్ రాథోడ్ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి సమయంలో వారి జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనతో వారి ఇద్దరి జీవితాలు కష్టాల్లో పడతాయి. ఈ ఇద్దరి జీవితాలే కాదు. వేరు వేరు కారణాల వల్ల వీరి స్నేహితుల జీవితాలు కూడా కష్టాల్లో పడతాయి. మరి, వీరి జీవితాలు ఎలా గాడిన పడ్డాయి అన్నదే కథాంశం.
స్నేహితులు.. వారి జీవితాల్లో కష్టాలు అన్న కథాంశంతో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఆ పాయింట్ మీద ఈ స్టోరీ కొత్తదేమీ కాదు. దర్శకులు నేటి పరిస్థితులకు, మారిన మనుషుల మనస్తత్వాలకు తగ్గట్టు సీన్లను రాసుకోవటంలో మాత్రమే సఫలం అయ్యారు. ప్రస్తుతం ఓటీటీలోకి వస్తున్న కంటెంట్‌కు ఏ మాత్రం తగ్గకుండా బోల్డ్‌నెస్‌ను జోడించారు. అవసరం ఉన్న చోట అడల్ట్ సీన్లను బానే ఎలివేట్ చేశారు. ఏదైనా మానసిక సంఘర్షణ మొదలైనపుడు మనుషులు ఎలా ఉంటారు.. ఎలా ప్రవర్తిస్తారు.. వారి మనస్తత్వాలు ఎలా మారతాయి అన్నది చక్కగా చూపించారు. సినిమా మొత్తం మనుషుల జీవితాల్లో జరిగే మానసిక సంఘర్షణ మీదే ఉంటుంది. పాత్రలను మలిచిన తీరులోనూ.. వాటితో కథను నడిపే తీరులోనూ దర్శకులు సక్సెస్ అయ్యారు. ఈ కథ ఎక్కువగా ఉత్తర భారతదేశంలోని పరిస్థితులకు తగ్గట్టుగానే ఉంటాయి. మూడ్ తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్ మనల్ని హత్తుకుంటుంది.
ఈ వెబ్ సిరీస్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటీనటుల పని తీరు గురించే. ఎవరికి వారు తమ పాత్రకు న్యాయం చేశారు. ఎమోషన్స్‌తో కూడుకున్న స్టోరీలో.. ఎమోషన్స్‌ను ఏమాత్రం అటుఇటూ కానివ్వకుండా బ్యాలెన్స్‌డ్‌గా నటించారు. ప్రధాన పాత్రధారి అయిన తమన్నా దగ్గరినుంచి చిన్న చిన్న పాత్రల్లో నటించిన వారు కూడా చాలా చక్కగా నటించారు. నిజం చెప్పాలంటే.. కొన్ని ఎమోషనల్ సీన్స్ జీవించారు కూడా. ఈ స్టోరీ నటీనటుల నటనే ప్లస్ పాయింట్.
చివరి మాట: కథలో కొత్తదనంలేని ‘జీ కర్థా’..
రేటింగ్: 2.5/5