సంక్రాంతి పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆ ఏముంది.. తినడం తాగడమే అని చాలామంది కుర్రాళ్లు సింపుల్ గా అనేస్తారు. ఇందులో మొహమాట పడటానికి ఏం లేదు కూడా. ఎందుకంటే జరిగేది అదే కాబట్టి! ఆంధ్రాలో అయితే ఈ పండగకు ఉన్న పాపులారిటీ వేరే లెవల్. మరీ ముఖ్యంగా సంవత్సరమంతా అక్కడా ఇక్కడా ఉద్యోగాలు చేస్తూ, సొంతూరికి దూరంగా ఉన్న వాళ్లంతా.. కూడా పుట్టిన ఊరికి వస్తారు. బాబాయి, పిన్ని, అత్త, మామ అంటూ చుట్టాలందరితోనూ కలిసిపోతారు. అయితే పండక్కి బోలెడ్ పిండి వంటలు చేస్తారు. దీని వెనక సైన్స్ ఉందని మీలో ఎందరికి తెలుసు?
అసలు విషయానికొస్తే.. ఏడాది మొత్తంలో మనం పిండి వంటలు చేసుకునే సందర్భాలు చాలా తక్కువ. దసరా, సంక్రాంతి టైంలోనే వీటిని తెలుగు లోగిళ్లలో ఎక్కువగా చేసుకుంటారు. సిటీలో ఉన్న ఫ్రెండ్స్, కొలీగ్స్.. సంక్రాంతికి ఊరెళ్తున్నారంటే చాలు.. తినడానికి ఏమైనా తీసుకురా అని చెబుతారు. అలా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఒక్కరూ కూడా అరిసెలు, పొంగడాలు, బూరెలు, చెక్కలు, బొబ్బట్లు, నువ్వు ఉండలు లాంటివి తింటారు. అయితే వీటి టేస్ట్ గురించి చెప్పుకోవడం కంటే వీటి వల్ల మనకు లభించే ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు చెప్పుకుందాం.
సంక్రాంతి అనగానే కొత్త బియ్యంతో పిండి వంటలు చేస్తారు. ఇలా చేయడం వెనక అర్థం, పరమార్థం రెండూ ఉన్నాయి. అయితే కొత్త బియ్యంతో వంటలు చేస్తే అజీర్తి చేస్తుంది. అందుకే వాటికి బెల్లం కలిసి అరిసెలు, పరమాన్నం చేస్తారు. దీని వల్ల అటు పిండి వంటలు చేసినట్లవుతుంది. అజీర్తి సమస్యలు కూడా రావు. మరోవైపు కొత్త బియ్యంతో వండిన పిండి వంటలని నైవేద్యంగా సమర్పించడం అంటే.. పంట చేతికందినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం.
ఇక సంక్రాంతికి చేసే పిండి వంటలన్నింట్లోనూ నువ్వులు చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. అరిసెలు, సకినాలకూ బాగా నువ్వులు దట్టిస్తారు. బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ల్లో కేవలం నువ్వులతోనే పిండి వంటలు చేసి ఒకరికొకరు పంచుకుంటారు. ఇకపోతే నువ్వులు అద్భుతమైన ఎనర్జీ ఫుడ్. అందుకే నువ్వుల నుంచి నూనె తీసిన తర్వాత ఆ తెలగ పిండిని పారేయకుండా పశువులకు పెడతారు. ఇక నువ్వులు బాగా వేడి చేస్తాయని పెద్దలు చెబుతుంటారు. కానీ సంక్రాంతి అప్పుడు మాత్రం సూర్యుడి దిశ మారి నిదానంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సరిగ్గా ఆ టైంలో నువ్వులు తింటే.. మన శరీరం వాతావరణానికి అనుగుణంగా టెంపరేచర్ మార్చుకుంటుంది. ఈ కారణంగానే పిండి వంటల్లో నువ్వులు యూజ్ చేస్తారు.
ఇక సంక్రాంతి టైంలో చేసుకునే పిండి వంటల్లో ఇడ్లీలు, గారెలు కచ్చితంగా ఉంటాయి. వీటిని మినుములతో చేస్తారు. ఆచారం ప్రకారం.. గతించిన పెద్దలకు మొదట గారెలని నివేదించి ఆ తర్వాత తింటారు. ఇక సంక్రాంతి టైంలో గారెలు తినడం వెనక వండర్ ఫుల్ హెల్త్ సీక్రెట్ ఉంది. మినుములు తినడం వల్ల ఒంట్లో టెంపరేచర్ పెరుగుతుంది. సంక్రాంతి టైంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మినుములు తినడం వల్ల దాన్ని మనం తట్టుకోగలుగుతాం. అలానే మినుములతో సున్నుండలు కూడా చేస్తారు. కొత్త అల్లుళ్లకు వీటికి బాగా నెయ్యి దట్టించి ఇస్తారు. ఇవి శరీరానికి బలాన్ని, వీర్యపుష్టిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అలానే మినుములని ఫుడ్ గా తీసుకోవడం వల్ల వచ్చే రాబోయే మాఘ మాసంలో జరగబోయే శుభకార్యాలకు ముందు.. అమ్మాయిలు, అబ్బాయిలు మంచి ఫిజిక్ తో కనిపిస్తారు. ఇలా ఏ వైపు నుంచి చూసినా సరే పిండి వంటలు అంటే కేవలం టేస్ట్ మాత్రమే కాదు.. దీని వెనక పెద్ద సైన్స్ ఉందని తెలుస్తోంది. మరి పిండి వంటల్లో మీకు బాగా ఇష్టమైనది ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.