మగాళ్లు ఆడవాళ్ళకి ప్రపోజ్ చేసినప్పుడు.. నా హృదయం చాలా విశాలమైనదని.. అందులో 10, 15 ఫ్లాట్లు కట్టి.. రెంట్లు ఇవ్వొచ్చని.. ఆ రెంట్ డబ్బులతో జీవితాంతం బతకొచ్చునని చెబుతుంటారు. నా గుండెలో నీకోసం గుడి కట్టానని.. ఆ గుండెలో దేవతవి నువ్వని కవితలు చెప్తుంటారు. అమ్మాయిలు నో చెప్తే మాత్రం.. ఛీ నీకు మనసు లేదు, అందులో చోటు లేదు, ఆడవారి గుండె ఇరుకు, గరుకు అంటూ అబ్బాయిలు తిట్టేసి వెళ్ళిపోతారు. ఏ ఫ్రెండ్ కో జరిగింది చెప్తే.. గుడి కాదురా.. ఏ మల్టీప్లెక్సో, షాపింగ్ కాంప్లెక్సో కట్టి ఉంటే వీకెండ్స్ లో నీతో పాటే ఉండేదని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అమ్మాయిలకి గుండె లేదురా.. అందుకే వాళ్లకి గుండెపోటు రాదు అంటూ కామెంట్స్ చేస్తారు. నిజానికి అమ్మాయిలకు గుండెపోటు రాదా? అంటే వస్తుంది. కానీ మగాళ్లతో పోలిస్తే చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. అసలు మగాళ్లకే గుండెపోటు ఎందుకొస్తుంది? స్టడీస్ ఏం చెబుతున్నాయి?
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. 50 శాతం గుండెపోటు వచ్చే మగాళ్లలో 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే ఉన్నారని తేలింది. 25 శాతం గుండెపోటు ఉన్న మగాళ్లలో 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే ఉన్నారట. ఇది విన్నారా.. పాశ్చాత్య దేశాల మనుషులతో పోలిస్తే.. భారతదేశంలో ఉన్న మగజాతి రెండు రెట్లు గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గుండె కండరాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా అందకపోవడం వల్ల కండరాల్లో బ్లాక్ ఏర్పడుతుంది. దీని వల్ల గుండెకు ఆక్సిజన్ అందదు. అది కరోనరీ హార్ట్ డిసీస్ కి దారి తీస్తుంది. ఎక్కువ మంది మగాళ్లకు కరోనరీ హార్ట్ డిసీస్ వస్తుందని తేలింది. కరోనరీ ధమనుల్లో మైనపు పొర పేరుకుపోవడం వల్ల కూడా గుండెపోటు వస్తుందని చెబుతున్నారు.
సర్ గంగారామ్ హాస్పిటల్ లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశ్వని మెహతా ఒక పబ్లిక్ స్పీచ్ లో విస్తుపోయే నిజాలు వెల్లడించారు. భారతదేశంలో ఏడాదికి 20 లక్షల మందికి గుండెపోటు వస్తుందని, వీరిలో ఎక్కువగా యువకులే ఉన్నారని చెప్పారు. గ్రామాల్లో నివసించే వారితో పోలిస్తే నగరాల్లో నివసించే మగవారికి 3 రెట్లు అధికంగా గుండెపోటు వస్తుందని పేర్కొన్నారు. మగవారికి గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో సిగరెట్ స్మోకింగ్, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్, అధిక కొవ్వు, మధుమేహం, అధిక రక్తపోటు, ఒబెసిటీ అండ్ ఫిజికల్ ఇనాక్టివిటీ, ఒత్తిడి వంటి వాటి వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఆడవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్స్ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి డైట్, జీవన విధానాన్ని సరిగా మెయింటెయిన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. కుటుంబ చరిత్ర ప్రకారం ఇంట్లో ఎవరికైనా కార్డియోవాస్క్యులర్ డిసీస్ ఉంటే గనుక 50 ఏళ్ల పైబడిన ఆడవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మోనోపాజ్ దశకు ముందు, ఈస్ట్రోజన్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది ప్రొటెక్టివ్ ఫోర్స్ కింద పని చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. ఈ కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ. మోనోపాజ్ దశ తర్వాత ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కారణంగా ఆడవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని స్టడీస్ చెబుతున్నాయి.
అయితే ఇప్పుడు మగాళ్లతో పాటు మాకూ సమాన హక్కులు కావాలని కోరుకునే స్త్రీలలో.. మగాళ్ల నుంచి మందు, చిందు, సిగరెట్, డ్రగ్స్ వంటి అలవాట్లను తమ హక్కుగా భావించే స్త్రీలు కూడా ఉంటారు కాబట్టి వారికి కూడా మగవారికేం తీసిపోని విధంగా సాధారణ స్త్రీలతో పోలిస్తే.. ఎక్కువ శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి. ఇందుమూలంగా యావత్ యువ లోకానికి స్టడీస్ చెప్పేదేంటంటే.. మద్యపానం ధూమపానం వంటి చెడు అలవాట్లు మనుషులను త్వరగా షెడ్ కి తీసుకెళ్ళిపోతాయి. అదన్నమాట విషయం.. ఆడవారికి హార్ట్ లేక కాదు, హార్ట్ లో చెడు ఆలోచనలు.. హార్ట్ కి హాని చేసే వాటికి అనుమతి ఇవ్వడం లేదు కాబట్టే ఆడవారికి గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ. మగాళ్ళది ఇషాల హృదయం కాబట్టి.. అన్నిటికీ ఎల్కమ్ చెబుతుంటారు. త్వరగా షెడ్ కెళ్ళిపోతారు. మరి ఆడవారి కంటే మగాళ్లకే గుండెపోటు రావడానికి ఇంకేమైనా కారణాలు మీకు తెలిస్తే షేర్ చేసుకోండి. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.