Telangana : తెలంగాణ రాష్ట్రానికి పెను ముప్పు పొంచి ఉందా..? ఇప్పటివరకు మనం ఎడారి ప్రాంతాల్లో మాత్రమే చూసిన భయానక వాతావరణ పరిస్థితులు..తెలంగాణలో చూడబోతున్నామా…? రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని వస్తున్నా…హెచ్చరికలు నిజమేనా.. ఎండలే కాదు.. రానున్న 10 నెలల్లో తీవ్ర కరువు పరిస్థితులు, తాగునీటి కొరతలు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తాయా..అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది..దీనికి ప్రధాన కారణం..వాతావరణ శాఖ అలర్ట్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ముందస్తు హెచ్చరికలే…
తెలంగాణలో రాబోయే కాలం ఎంత ప్రమాదకరంగా మారబోతుందో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోనుందని, రానున్న పది నెలల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే ఎండల తీవ్రత కంటే.. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ప్రతాపం చూపించే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌ను తాకే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సిన పరిస్థితులు తలెత్తడం, పరిస్థితి తీవ్రత ఎంతలా ఉందో కళ్లకు కడుతోంది.
ఈ ఎల్ నినో ప్రభావం అత్యధికంగా వ్యవసాయ రంగంపై పడనుంది. ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. పంటలకు సాగునీరు అందించడం రాబోయే రోజుల్లో చాలా కష్టమని ఇంజనీరింగ్, వ్యవసాయ శాఖలు తేల్చిచెప్పాయి. పరిస్థితి తీవ్రతను ముందే గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులను ముందస్తుగా అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో రైతులు ఎవరూ కూడా రెండో పంట వేయవద్దని ఇప్పటికే స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. నీటి లభ్యత లేకపోవడంతో పంటలు వేస్తే పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని, అందుకే రైతులు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.”
కేవలం గ్రామాల్లోనే కాదు, మహానగరం హైదరాబాద్‌లోనూ తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతుండటంతో, రాబోయే వేసవి కాలంలో తాగునీటి కోటా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. నీటి వృధాను అరికట్టడం, బోర్ల రీచార్జింగ్‌ను ప్రోత్సహించడం వంటి అత్యవసర చర్యలు తీసుకోకపోతే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ తీవ్రమైన నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మొత్తానికి చూస్తే.. తెలంగాణ వైపు ఎల్ నినో రూపంలో ఒక పెద్ద ముప్పు ముంచుకొస్తోంది. రాబోయే పది నెలలు రాష్ట్రానికి అగ్ని పరీక్ష లాంటివి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను, ముందస్తు ప్రణాళికలను మనం తేలికగా తీసుకోకూడదు. నీటిని పొదుపుగా వాడటం, ప్రకృతిని కాపాడుకోవడం ద్వారానే ఈ గండం నుంచి మనం బయటపడగలం.
