హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మరోసారి గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టు బట్టబయలైంది. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారుల కళ్లు గప్పి కోట్లాది రూపాయల విదేశీ బంగారాన్ని నగరంలోకి తరలించేందుకు వేసిన హైటెక్ ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అయింది. ఏకంగా రెండు కోట్ల పాతిక లక్షల రూపాయల విలువైన 1.48 కిలోల విదేశీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు వేసుకున్న దుస్తుల కింద ప్రత్యేకంగా తయారు చేసిన పౌచ్‌లో ఈ గోల్డ్‌ను దాచి తరలిస్తుండటం చూసి అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు. అసలు ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అసలు మాఫియా సూత్రధారులు ఎవరు? ఆ ప్రయాణికుడు ఎక్కడి నుంచి వచ్చాడు?
తమిళనాడులోని తిరుచి నుంచి ఒక ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే అతని ప్రవర్తనలో అనుమానం రావడంతో ఎయిర్‌పోర్ట్‌లో విధుల్లో ఉన్న డిఆర్ఐ ఇంటెలిజెన్స్ టీమ్స్ క్షణాల్లో పసిగట్టాయి. ఆ ప్రయాణికుడిని ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు చేపట్టారు. మొదట సాధారణ లగేజీ సెర్చ్‌లలో ఏమీ దొరకనప్పటికీ, అతడి మెటల్ డిటెక్టర్ స్కాన్ చేయడంతో బంగారం బయటపడింది.
![]()
“వెంటనే స్పందించిన డిఆర్ఐ అధికారులు బంగారం మొత్తాన్ని సీజ్ చేసి, ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కస్టమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. గతంలో కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ తరహా కస్టమ్స్ స్మగ్లింగ్ ముఠాలు ఎన్నోసార్లు పట్టుబడినప్పటికీ, కొత్త కొత్త మార్గాల్లో దుస్తులు, బాడీ క్యారీయింగ్, ఎలక్ట్రానిక్ వస్తువుల రూపంలో బంగారం తీసుకొస్తుండటం కలకలం రేపుతోంది. ఈ ప్రయాణికుడు కేవలం ఒక క్యారియర్ మాత్రమేనా లేదా దీని వెనుక ఏదైనా పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రాకెట్ ఉందా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.”
“శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిరంతరం డిఆర్ఐ, కస్టమ్స్ నిఘా అత్యంత కఠినంగా ఉంటుందని, అక్రమ మార్గాల్లో పన్నులు ఎగవేసి విదేశీ వస్తువులు, బంగారం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. దేశంలోకి ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా జరిగే అక్రమ బంగారం రవాణాను అడ్డుకోవడంలో సెక్యూరిటీ టీమ్స్ అభినందనీయమైన పాత్ర పోషిస్తున్నాయి.
