మత్తులో జోగితే ప్రపంచంలో ఏం జరుగుతుందో కాదూ.. మన చుట్టూ ఏం జరుగుతుందో అన్న విషయాన్ని కూడా గుర్తించలేం. మందు తాగకండిరా బాబూ అని పోలీసులు.. సినిమా థియేటర్లలో, పెద్ద పెద్ద పోస్టర్లు వేసినా బుద్ధి రాదూ. మద్యం మత్తులో తమ కుమారుడ్నిని పొగొట్టుకున్నారు ఓ తల్లిదండ్రులు
మద్యం ఎంతటీ పనినైనా చేయిస్తుంది. మత్తులో జోగితే ప్రపంచంలో ఏం జరుగుతుందో కాదూ.. మన చుట్టూ ఏం జరుగుతుందో అన్న విషయాన్ని కూడా గుర్తించలేం. మందు తాగకండిరా బాబూ అని పోలీసులు, సినిమా థియేటర్లలో, పెద్ద పెద్ద పోస్టర్లు వేసినా బుద్ధి రాదూ. తాము ఇంతేనని అందులోనే జోగుతుంటారు మందు బాబులు. కిడ్నాపులు, అత్యాచారాలు, హత్యలు ఈ మత్తులోనే జరుగుతున్నాయనేది ఎవ్వరూ అంగీకరించలేని వాస్తవం. తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి మద్యం పోయించి.. వారు మత్తులోకి వెళ్లాక వారి ఐదేళ్ల బిడ్డతో పరారయ్యాడు ఓ వ్యక్తి. తేరుకున్నాక బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు ఆ దంపతులు. ఈ ఘటన సైదాబాద్ లో చోటుచేసుకుంది.
సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై శివకుమారి తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన పార్ధ జంగయ్య, లక్ష్మి దంపతులు. వీరికి రామ్ చరణ్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సంతోష్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా శనివారం సైదాబాద్ శంకేశ్వరబజార్‌లోని శంకేశ్వరాలయం వద్దకు బిక్షాటన కోసం వెళ్లారు. ఆ సమయంలో వీరికీ నల్గొండ జిల్లాకు చెందిన మరో వ్యక్తి పాండుతో పరిచయం ఏర్పడింది. అతడూ కూడా భిక్షాటన చేస్తు ఉంటాడు.
ఆదివారం సాయంత్రం బిక్షాటన పూర్తి అయిన తర్వాత పాండు మద్యం కొనిపిస్తానని లక్ష్మి, జంగయ్యలకు చెప్పాడు. అతడి మాటలను నమ్మిన దంపతులు.. బాలుడితో పాటు చంపాపేట వైన్స్ వద్దకు వెళ్లారు. లక్ష్మి, జంగయ్య మద్యం మత్తులో జోగుతుండగా.. ఇదే అదునుగా భావించిన పాండు బాలుడిని తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. కొంతసేపటి తర్వాత తేరుకున్నబాలుడు కనిపించక పోవడంతో వెతికారు. ఎంతకూ కనిపించకపోవడంతో సోమవారం రాత్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైన్స్‌షాపు వద్ద ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించగా పాండు బాలుడిని ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. పాండు సొంత ఊరికి వెళ్లిన పోలీసులు అతడి గురించి కూపీ లాగుతున్నారు.