మనం ఇప్పటివరకు సెల్ ఫోన్లలో 5జీ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా 5జీ టెక్నాలజీ కార్లపై చర్చ జరుగుతోంది. 5జీ కార్లా అనుకోకండి..? వినడానికి వింతగా ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ అదే ప్రయత్నాల్లో ఉన్నాయి మరి. అసలు 5జీ కారేంటి..? అవి భవిష్యత్ లో రవాణా అవసరాలకు అనుగుణంగా ఉంటాయా..? రవాణాలో ఎలాంటి మార్పులను తీసుకొస్తాయి..? అనే ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం 2025 నాటికి ప్రతి నాలుగు కార్లలో ఒకటి 5జీ టెక్నాలజీ ఆధారంగా నడుస్తాయని కౌంటర్ పాయింట్ సంస్థ చేసిన రీసెర్చ్ ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కార్లలో 90 శాతం 4జీ టెక్నాలజీతో నడుస్తున్నాయి. రాబోయే కాలంలో 5జీ టెక్నాలజీ కార్ల రాకతో రవాణాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతమున్నసమాచారం ప్రకారం అమెరికా, చైనా, జర్మనీ, యూకే వంటి పలు అభివృద్ధి చెందిన దేశాలలో 5జీ టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్ లు ఇప్పటికే అందుబాటులో ఉండడంతో.. 5జీ టెక్నాలజీ కలిగిన కార్లను త్వరగా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కార్ల కంపెనీలన్నీ డిజిటలైజేషన్ వైపు అడుగులువేస్తున్నాయి. చాల దేశాలు ఇప్పటికే 5జీ టెక్నాలజీని తమ దేశాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి కార్ల కంపెనీలన్నీ. ఇప్పటికే ఈ టెక్నాలజీకి సంబంధించి ఆటోమోటివ్ పరిశ్రమలో BMW- iX మోడల్ మెుదటి 5జీ టెక్నాలజీ ఆదారిత కారుగా నిలిచింది. ఈ అత్యాధునిక టెక్నాలజీ కార్లను మొదటగా జర్మనీ ప్రారంభించింది. ఈ టెక్నాలజీ విజయవంతం అవ్వాలంటే స్థానిక ప్రభుత్వాల సహకారం ముఖ్యమని నిపుణులు అంటున్నారు.