భారత టెస్ట్ క్రికెట్ జట్టులో చటేశ్వర్ పుజారాది ప్రత్యేక స్థానం. 2010లో టెస్ట్ జట్టులోకి అరంగేట్రం చేసిన పుజారా అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్, ప్రస్తుత టీమిండియా హెచ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా కూడా పుజారాకు పేరొచ్చింది. ఇన్నాళ్లు ఆ పేరును నిలుపుకుంటూ వస్తున్న పుజారా.. రెండేళ్ల నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో జట్టు పరంగా భారత్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ పుజారా మాత్రం వ్యక్తిగతంగా దారుణంగా విఫలం అవుతున్నాడు. పుజారా గత టెస్ట్ ఇన్నింగ్స్‌లను, చేసిన పరుగులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.
అతను ఆడిన చివరి 31 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా లేదు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ పుజారా ఘోరంగా విఫలం అయ్యాడు. మొదటి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 48 పరుగులే చేశాడు. ఇక రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. గతంలో తన డిఫెన్స్‌తో ప్రపంచ మేటి బౌలర్లకు ముచ్చమటలు పట్టించి చుక్కలు చూపించిన పుజారా.. ప్రస్తుతం సాదాసీదా బౌలర్ల చేతిలో కూడా అవుట్ అవుతున్నాడు. ఫారెన్‌లో బౌన్స్ పిచ్‌లపై కూడా అద్భుతంగా ఆడిన పుజారా.. స్వదేశంలో మాత్రం మనకు అచ్చొచ్చిన పిచ్‌లపై తేలిపోతున్నాడు. దారుణంగా క్లీన్ బౌల్డ్ అవుతూ విమర్శల పాలవుతున్నాడు.
దీంతో టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పుజారా పని అయిపోయిందనే విమర్శ కూడా వినిపిస్తుంది. దీనికి తోడు భారత్‌లో యువ క్రికెటర్లకు కొదవలేదు. జాతీయ జట్టులో అవకాశాల కోసం టాలెంటెడ్ యంగ్ క్రికెటర్లు ఎందరో వేచిఉన్నారు. ఇలాంటి సమయంలో పుజారా విఫలం అవుతుండడం, యువ క్రికెటర్లు మెరుపులా దూసుకొస్తుండడంతో ఈ నయా వాల్‌కు కష్టాలు తప్పేలా లేవు. మరి పుజారా ఫామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.