వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ విండీస్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చాడు. వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో వెస్టిండీస్ దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. విండీస్ మాజీ స్టార్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత.. పూరన్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది విండీస్ క్రికెట్ బోర్డు. కానీ.. కెప్టెన్‌గా పూరన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అలాగే రెండు సార్లు టీ20 వరల్డ్ ఛాంపియన్ అయిన విండీస్ జట్టు తొలిసారి గ్రూప్ స్టేజ్‌ను కూడా దాటలేక స్కాట్లాండ్, ఐర్లాండ్ లాంటి పసికూనల చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.
దీంతో వెస్టిండీస్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పటికే జాతీయ జట్టుకు ఆడకుండా.. కొంతమంది కీలక ఆటగాళ్లు ఫ్రాంచైజ్ లీగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలతో సతమతమైన విండీస్ క్రికెట్.. వరల్డ్ కప్‌లో ఘోర అవమానం వెస్టిండీస్ ప్రతిష్టను మరింత దిగజార్చింది. దీంతో.. పూరన్ ఆ ఓటమి బాధ్యతను తీసుకుంటూ.. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. 15 వన్డేలు, 15 టీ20ల్లో వెస్టిండీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పూరన్.. కేవలం 4 వన్డేలు, 4 టీ20ల్లో మాత్రమే జట్టును విజయపథంలో నడిపించాడు. కెప్టెన్‌గానే కాకుండా.. ఆటగాడిగా కూడా పూరన్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అయితే.. కెప్టెన్సీ భారంతో పూరన్ ఫామ్ దెబ్బతింటుదనే వాదన కూడా ఉంది.
అయితే.. కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఒక సీనియర్ ఆటగాడిగా జట్టు కోసం అనునిత్యం శ్రమిస్తానని, వెస్టిండీస్ జట్టుకు పూర్వవైభవం తీసుకురావడమే తన లక్ష్యమంటూ పూరన్ పేర్కొంటూ రాజీనామా చేశాడు. కాగా.. పూరన్ రాజీనామా వెనుక ఐపీఎల్ ఆడాలనే దురుద్దేశం ఉందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. జట్టు కెప్టెన్‌గా ఉంటే.. కచ్చితంగా జట్టు ఆడే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండాలి. అదే ఆటగాడిగా ఉంటే మాత్రం.. అంత ఇబ్బంది ఉండదనే విషయాన్ని దృష్టిలోపెట్టుకుని… ఐపీఎల్ 2023 కోసమే పూరన్ జాతీయ జట్టు కెప్టెన్సీని వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండున్నర నెలల పాటు నిర్విరామంగా సాగే ఐపీఎల్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేందుకే పూరన్ కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. కాగా.. పూరన్‌ను సన్‌రైజర్స్ జట్టు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరీ ఐపీఎల్ 2023లో పూరన్ అమ్ముడుపోతాడో లేదో చూడాలి.
JUST IN: Nicholas Pooran has relinquished his position as West Indies ODI and T20I captain pic.twitter.com/gHtf46fUw0
— ESPNcricinfo (@ESPNcricinfo) November 21, 2022