‘ఐపీఎల్ 2021’ సీజన్ దాదాపు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. క్వాలిఫయర్2, ఫైనల్ మాత్రమే మిగులున్నాయి. ఇదిలా ఉంటే బీసీసీఐ అప్పుడే ఐపీఎల్ సీజన్ 15కు సన్నద్ధమవుతోంది. డిసెంబరులో మెగా వేలం ఉంటుందని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ప్లేయర్ రిటైన్‌కు సంబంధించి అధికారిక వార్తలయితే వినిపించడం లేదు. ఇప్పటివరకు ఎవరు చెప్పినా.. ఇద్దరు భారతీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను గానీ, ముగ్గురు భారతీయ, ఒక విదేశీ ఆటగాడు గానీ రిటైన్ చేసుకోవచ్చు అంటూ వార్తలు వినిపిస్తున్నా.. అది అధికారికం కాదు. రెండు కొత్త టీమ్లు కూడా వస్తున్న తరుణంలో మెగా ఆక్షన్ ఇంకా ఆసక్తిగా మారనుంది.
బెంగళూరులోకి కేఎల్ రాహుల్!
కేఎల్ రాహుల్ అనగానే ఒక నిలకడ గల ఆటగాడు, మంచి కెప్టెన్ అని అంటారు. పంజాబ్ కెప్టన్‌గా అద్భుతంగానే రాణించాడు. ప్రతి సీజన్‌లో బ్యాటుతోనూ కేఎల్ రాహుల్ బాగా రాణిస్తుంటాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు బాగా బ్యాటింగ్ చేయగలడు రాహుల్. అయితే రాహుల్ పంజాబ్ జట్టును వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబ్ తనను రిటైన్ చేసుకోవడంపై రాహుల్ అంత ఆసక్తిగా ఉన్నట్లు లేడని తెలుస్తోంది. మరోవైపు ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ ఆఖరి సీజన్ ఆడేశాడు. ఆర్సీబీ కూడా ఒక సమర్థుడైన కెప్టెన్ వేటలో ఉంది. రాహుల్ వేలంలోకి వచ్చే పనైతే తీసుకునేందుకు ఆర్సీబీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
కొత్త ఫ్రాంచైజీలు సైతం
మంచి కెప్టెన్లు, పేరున్న ఆటగాళ్ల కోసం కొత్త ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. ఈ తరుణంలో వారికి మంచి అనుభవమున్న ఆటగాళ్లు కావాలి. కేఎల్ రాహుల్ కచ్చితంగా మంచి ఆప్షన్ అవుతాడు. మరోవైపు ‘పరిణామాలు మారుతున్నాయి. కొత్త జట్లు వస్తున్నాయి. రిటైన్ వివరాలు తెలీదు. వచ్చే సీజన్ ఏ జట్టులో ఉంటామో’ అంటూ ధోనీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ధోనీ కూడా జట్టు మారతాడేమో అని అనుమానం రాకపోదు. వాలెట్‌లోని 75 శాతం నిధులు ఖర్చు చేయాలని కొత్త నిబంధన కూడా తెస్తున్న తరుణంలో ప్లేయర్లను కోట్లు పోసి కొంటారని టాక్ వినిపిస్తోంది.