గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్‌కు సువర్ణ అవకాశం దక్కింది. రషీద్‌ను ఐపీఎల్ 2023 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు తీసుకుంది. కొన్ని రోజుల క్రితం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన కలగా చెప్పిన రషీద్.. తక్కువ టైమ్‌లో ఆ కలను నేరవేర్చుకోనున్నాడు. అండర్-19 వైస్ కెప్టెన్‌గా రషీద్ టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌ను యష్ ధుల్ కెప్టెన్సీలో టీమిండియా గెలిచి.. ఐదో సారి అండర్-19 విశ్వవిజేతగా నిలిచింది. ఈ టీమ్‌కు షేక్ రషీద్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే.. సమీ ఫైనల్, ఫైనల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రషీద్.. రెండు కీలక మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి.. టీమిండియా ఛాంపియన్‌గా నిలువడంలో ముఖ్య భూమిక పోషించాడు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మల్లయ పాలెంకు చెందిన రషీద్ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. తండ్రి బలీషా వలీ లోన్ రికవరీ ఏజెంట్. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నా.. కొడుకుకి క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించి, అతన్ని ప్రొత్సహించాడు. దాంతో తొమ్మిదేళ్లకే అండర్-14 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రషీద్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అంతర్ జిల్లా పోటీల్లో శ్రీకాకుళంపై పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి అందరి దృష్టి ఆకర్షించాడు. 2017లో అండర్-16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. తర్వాతి ఏడాది అండర్-19లో 680 రన్స్‌తో జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లాంటి అత్యంత విజయవంతమైన టీమ్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
అయితే.. షేక్ రషీద్ వంటి యంగ్ టాలెంటెడ్ క్రికెటర్లను పిక్ చేసుకోవడంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టైలే వేరు. మిగతా ఏ ఫ్రాంచైజ్‌లు కూడా చెన్నై టీమ్ చేసినంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయవనే వాదన ఉంది. యువ క్రికెటర్లను వెతివెతికి టీమ్‌లోకి తీసుకొచ్చి వారిని స్టార్ క్రికెటర్లుగా మారుస్తుంది సీఎస్‌కే. అయితే.. చెన్నై ఇలా యంగ్ క్రికెటర్ల విషయంలో ముందు ఉండటానికి కారణం.. ఎంఎస్ ధోని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుర్రాళ్లతోనే అద్భుతాలు చేయగల ధోని.. ఇప్పుడు రషీద్ విషయంలో కూడా అదే ఫార్మూలా ప్రయోగించినట్లు సమాచారం. అండర్-19కు ఆడుతున్న సమయంలో రషీద్ టాలెంట్‌ను గుర్తించిన ధోని.. అతన్ని ఈ ఏడాది జట్టులోకి తీసుకోవాలని ఆక‌్షన్ టీమ్‌కు పక్కా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరి రషీద్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Super Times await you, Rasheed! Anbuden Welcome!💛#SuperAuction #WhistlePodu 🦁💛 pic.twitter.com/1gCKiChULP
— Chennai Super Kings (@ChennaiIPL) December 23, 2022