ఓ వైపు ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో తాజాగా మరో వినూత్న ఎన్నికల హామీ తెర మీదకు వచ్చింది. తమను గెలిపిస్తే.. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని సీఎం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మరికొద్ది రోజుల్లో గుజరాత్‌లో ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ మహిళలకు ఈ కొత్త హామీనిచ్చారు. గుజరాత్‌లో తమకు ఓట్లేసి.. ఆప్ అభ్యర్థిని ముఖ్యమంత్రి సీటుపై కూర్చోబెడితే.. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1,000 చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో బుధవారం వందలాది మంది మహిళల సమక్షంలో ఈ హామీనిచ్చారు. ‘ ఈ ఎన్నికల్లో మాకు అవకాశం ఇచ్చి సీఎం పీఠంపై కూర్చోబెట్టండి. మేం గెలిస్తే.. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాం. ఈ హామీ ఉచిత తాయిలం కానేకాదు. ఇది మీ హక్కు. ప్రజల సొమ్ము తిరిగి ప్రజల చెంతకే చేరాలి’ అంటూ కేజ్రీవాల్ ప్రసంగించారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.