ఎన్నికలు దగ్గర పడే కొద్ది అసంతృప్తుల్లో భయం పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా పొత్తులతో ఎన్నికల్లోకి వెళ్లే పార్టీలకు సంబంధించిన నేతల్లో తమకు సీటు వస్తుందా? లేదా? అన్న భయం ఉండనే ఉంటుంది. అందుకే పార్టీలు మారటానికి చూస్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాయి. అధికార పార్టీ తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది. దీనికనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాదు! పక్క పార్టీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన కలిసి వెళ్లటానికి నిశ్చయించుకున్నాయి. ఈ రెండు పార్టీల పొత్తు దాదాపు ఖరారైంది. కేవలం రెండు పార్టీలనుంచి అధికారిక ప్రకటన, సీట్ల పంపకాలకు సంబంధించిన వివరాలు రావాల్సి ఉన్నాయి. టీడీపీ-జనసేనలు పొత్తులో ఉంటేనే బలం అని భావిస్తున్నాయి. అయితే, రెండు పార్టీలు కలిసి పోటీ చేయటం టీడీపీ, జనసేనలోని కొంతమందికి నచ్చటం లేదు.
అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారి అసంతృప్తికి కారణం లేకపోలేదు. సీట్ల పంపకాల్లో తమకు ఎక్కడ స్థానం లేకుండాపోతోందో అని భయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులు నచ్చక కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్ నేత పార్టీ మారేందుకు చూస్తున్నారంట. వైఎస్సార్ సీపీలో చేరటానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయన ఎవరో కాదు.. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ. ఈయన 2009 ఎన్నికల్లో టీడీపీ తరపు నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లిపోయింది. కామినేని శ్రీనివాస్ ఎమ్మెలేగా గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో జయమంగళ వెంకట రమణ టీడీపీ నుంచి పోటీలో దిగారు. అయితే, ప్రత్యర్థి అయిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావుపై ఓడిపోయారు. అయితే, ఎన్నికలు అయిపోయి..
కొత్తగా మరో సారి ఎన్నికలు జరబోతున్న ఈ సమయంలోనూ నియోజకవర్గ ఇంఛార్జ్ నియామకం విషయంలో జాప్యం జరుగుతోంది. టీడీపీ-జనసేన పొత్తుల నేపథ్యంలో కైకలూరు ఎమ్మెల్యే స్థానం జనసేనకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ పశ్చిమం..కైకలూరు స్థానాలు జనసేనకు ఖరారు అయినట్లు టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీంతో తనకు సీటు దక్కదని భావించిన జయమంగళ వెంకట రమణ పార్టీ మారటానికి నిశ్చయించుకున్నారంట. వైఎస్సార్ సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. జయమంగళ వెంకట రమణ వైఎస్సార్ సీపీలో చేరతారా? లేదా? అన్నది తెలియాలంటే ఆయన కానీ, వైఎస్సార్ సీపీ కానీ, దీనిపై స్పందించాల్సిందే. మరి, జయమంగళ వెంకట రమణ వైఎస్సార్ సీపీలో చేరతారన్న ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.