స్పోర్ట్స్ డెస్క్- అజాజ్ పటేల్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించారు అజాజ్ పటేల్. భారత మూలాలున్న ఈ న్యూజిలాండ్ క్రికెటర్ జీవితంలో ముంబై టెస్టు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. టీమిండియా, న్యూజిలాండ్ రెండో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో 47.5 ఓవర్లు వేసిన అజాజ్ పటేల్, 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా జట్టును ఆలౌట్ చేసి, ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్ గా అజాజ్ పటేల్ రికార్డు నెలకొల్పాడు. అది కూడా తాను పుట్టిన భారత్ గడ్డపైనే పటేల్ ఈ రికార్డ్ సృష్టించడం గమనార్హం. ఇలా అరుదైన రికార్డును నెలకొల్పిన అజాజ్ పటేల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే.. ఈ రికార్డు సాధించిన ఆటగాళ్ల క్లబ్ లోకి స్వాగతం అంటూ అజాజ్ ను అభినందించగా, మహ్మద్ కైఫ్ అద్భుతమైన ఇన్నింగ్స్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
మరోోవైపు టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అజాజ్ పటేల్ కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రత్యర్ధి జట్టు అటగాడైనప్పటికీ న్యూజీలాండ్ డ్రెస్సింగ్ రూంకు వెళ్లి మరీ అజాజ్ పటేల్ ను అభినందించారు విరాట్. అంతే కాదు టీంఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం అజాజ్ పటేల్ కు శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ కోహ్లీతో పాటు వెళ్లిన మహమ్మద్ సిరాజ్ కూడా పటేల్ ను ప్రత్యకంగా అభినందించారు. అదే విధంగా ఆర్పీ సింగ్, పార్థివ్ పటేల్ సహా సిమన్ డౌల్ తదితరులు అజాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
ఇలా ప్రత్యర్ధి జట్టు ఆటగాడు, అందులోను టీంఇండియాను ఓడగొట్టిన అజాజ్ పటేల్ ను విరాట్, రాహూల్, సిరాజ్ సహా పలువురు అభినందించడం మంచి సంప్రదాయం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అజాజ్ పటేల్ రికార్డు నేపథ్యంలో కివీస్ ఆటగాళ్లంతా చప్పట్లు కొడుతూ, అతడిని తీసుకువస్తుండగా,. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ సహా ఇతర ఆటగాళ్లు అతడిని చూసి సంతోషపడుతున్న క్షణాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది.
How about this message from @anilkumble1074 to @AjazP #INDvNZ https://t.co/OWUaN0Jiaf
— BLACKCAPS (@BLACKCAPS) December 4, 2021